విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

26 Aug, 2014 03:19 IST|Sakshi

రాప్తాడు: నేటి విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ ఆకాంక్షించారు. సెయింట్ విన్సెంట్ డీపాల్ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ‘ఇన్‌స్పైర్-2014’ వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌తోపాటు అనంతపురం నగర మేయర్ మదమంచి స్వరూప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  చమన్ మాట్లాడుతూ విజ్ఞానశాస్త్ర అభివృద్ధిపై మానవజాతి మనుగడ ఆధారపడి ఉందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులే స్వయంగా నమూనాలను తయారుచేసేలా వారిని తీర్చిదిద్దాలన్నారు.
 
 మేయర్ మాట్లాడుతూ దేశభవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు.  సమాజాన్ని నడిపించేది విజ్ఞానమేనన్నారు. సైన్స్ పట్ల ప్రతి విద్యార్థి అవగాహన, ఆలోచన పెంపొదించుకోవాలన్నారు. డీఈఓ మధుసూదన్‌రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని, విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. మొత్తం 258 నమూనాలు ప్రదర్శించగా ఇందులో 15 నమూనాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నామన్నారు.  అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.  జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ రాఘవయ్య, జేడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, సర్పంచ్ ఆకుల వెంకటరాముడు, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి,  ఇతర శాఖాల అధికారులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు