మెనూనా..ఎప్పుడో మరిచిపోయాం!

12 Jul, 2014 02:50 IST|Sakshi
మెనూనా..ఎప్పుడో మరిచిపోయాం!

చీపురుపల్లి: ‘గుడ్డు లేదు... కాయగూర లేదు... పల్చని చారు, గట్టి అన్నమే దిక్కు... ఏదో తినాలి కాబట్టి తింటున్నాం తప్ప నోటికి రుచి తగలదు.’ ఇదీ చీపురుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు సాక్షాత్తూ జాయింట్ కలెక్టర్ రామారావు ఎదుట వ్యక్తం చేసిన అభిప్రాయం. శుక్రవారం చీపురుపల్లి బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ‘ఫుడ్‌పాయిజన్’ అయిందంటూ జాయింట్ కలెక్టర్ రామారావుకు ఒక ఫోన్ కాల్ వెళ్లింది. దీంతో ఆయన స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆర్‌డీఓను వెంట పెట్టుకుని ఆయనే స్వయంగా బాలికోన్నత పాఠశాలకు వచ్చారు. దీంతో అక్కడ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలను విద్యార్థులు వివరించారు. అనంతరం మూడు తరగతి గదుల్లోకి జేసీ వెళ్లారు.
 
విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. మధ్యా హ్న భోజనం పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. రుచిగా ఉంటుందా.. మెనూలో గుడ్డు పెడుతున్నారా? అంటూ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మోనూను ఎప్పుడో మరిచిపోయూమని పలువురు విద్యార్థులు బదులిచ్చారు. భోజనం రుచిగా లేదని చెప్పారు. నెలకు ఒకసారి కూడా గుడ్డు పెట్టడం లేదని కొందరు చెప్పగా.. వారానికి ఒకసారి మాత్రమే పెడుతున్నారని మరికొందరు సమాధానమిచ్చారు. అన్నం అస్సలు తినలేకపోతున్నామని మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఏం చేస్తున్నారని పాఠశాల హెచ్‌ఎం మహలక్ష్మిని జేసీ ప్రశ్నించారు. గతంలో ఎంతోమంది అధికారులకు ఇక్కడి పరిస్థితులు వివరించానని ఆమె బదులిచ్చారు.
 
అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో మాట్లాడిన ఆయన.. పిల్లల కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు సక్రమంగా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. దీనికి నిర్వాహకులు మాట్లాడుతూ.. వారానికి ఒకసారి భోజనంతోపాటు గుడ్డు పెడుతున్నామని, రాజకీయంగా తమను వేధిస్తున్నారని, తాము ఎలాంటి తప్పూ చేయలేదంటూ కంటతడి పెట్టుకున్నారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటున్నామని వివరించారు. పూర్తి విచారణ అనంతరం కలెక్టర్ దృష్టిలో ఈ విషయాన్ని ఉంచి తగు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ రామారావు తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ డి.పెంటయ్య, ఎంఈఓ బి.నాగేశ్వరరావు, ఈఓపీఆర్‌డీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు