ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై తేనెటీగల దాడి

6 Jul, 2015 21:22 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా(వేంపల్లె): అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై తేనెటీగలు దాడిచేసిన ఘటన ఆదివారం రాత్రి వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలో చోటుచేసుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆట స్థలంలో ఆడుకునేందుకు వచ్చారు. వీరందరూ కలిసి పక్కనే ఉన్న శేషాచలం అడవుల్లోకి వెళ్లి ఫొటోలు తీసుకోవాలనుకున్నారు. 15 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రదేశం నుంచి దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న శేషాచలం అడవుల్లోకి వెళ్లారు. అడవిలో వీరికి కనిపించిన తేనె తుట్టెను సెల్‌ఫోన్‌తో ఫొటో తీస్తుండగా ప్లాష్ వెలుతురుకు తేనెటీగలు (పెద్ద ఈగలు) ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. దీంతో విద్యార్థులు చెల్లాచెదురుగా విడిపోయి పరుగులు తీశారు. వీరిలో 14 మంది ట్రిపుల్ ఐటీకి చేరుకోగా గంగాధర నాయక్ అనే విద్యార్థి రాలేదు.

 

గంగాధర నాయక్ అడవిలో తప్పిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పోలీసులు, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది శేషాచలం అడవుల్లో గంగాధర నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 1.30 గంటల వరకు వెతికినప్పటికి కనిపించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో మళ్లీ ఉదయం వెతికేందుకు వెళుతుండగా రాత్రంతా అడవిలోనే గడిపిన ఆ విద్యార్థి తిరిగి వ స్తూ పోలీసులకు తారసపడ్డాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలతో ఉన్న అతన్ని అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. వినీత్ అనే విద్యార్థికి కూడా కడప రిమ్స్‌లో చికిత్స అందించి ట్రిపుల్ ఐటీకి పంపించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు