పాచిన అన్నం మీరు తింటారా?

6 Aug, 2014 03:25 IST|Sakshi
పాచిన అన్నం మీరు తింటారా?

యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ వీసీ బంగ్లా ఎదుట మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ‘డీ’ మెస్‌కు చెందిన ‘ఈ’ బ్లాక్ విద్యార్థులు వీసీ బంగ్లా వద్దకు వచ్చి బైఠాయించారు. పాచిపోయిన భోజనం ప్లేట్‌లో తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించారు. పాచిపోయిన భోజనం పెట్టారంటూ విద్యార్థులు ఆరోపించారు. మంగళవారం ఉదయం వండిన ఆహారాన్ని రాత్రి పెట్టడంతో ఆ భోజనం చెడిపోయి దుర్వాసన వస్తోందని విద్యార్థులు చెప్పారు. పాచిపోయిన భోజనాన్ని మీడియాకు చూపించారు. హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే అధికారులు విద్యార్థులకు సరైన భోజనం పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
 
 విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వార్డెన్ చలపతి వీసీ బంగ్లా వద్దకు వచ్చారు. దీంతో అగ్రహించిన విద్యార్థులు ఈ పాచిపోయిన భోజనాన్ని మీరు తిని చూపించాలని కోరారు.  ఆ భోజనం తనకు వద్దని వార్డెన్ అనడంతో విద్యార్థులు ఆగ్రహించారు. మాకు మాత్రం పాచిపోయిన భోజనం పెడతారు. మీరు ఎందుకు తినరని ప్రశ్నించారు. వార్డెన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. అనంతరం రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు ‘ఈ’ బ్లాక్‌ను సందర్శించారు. భోజనాన్ని పరిశీలించారు. భోజనం పాచిపోయిందని నిర్ధారించి, మళ్లీ భోజనం వండించారు. రాత్రి పదకొండు గంటల వరకూ వరకు అక్కడే ఉండి అన్నం వడ్డించాకే వెళ్లారు.

మరిన్ని వార్తలు