విద్యార్థికి పరీక్ష !

3 Apr, 2018 09:27 IST|Sakshi

చెదురుతున్న ప్రణాళిక...మొదలైన ఆందోళన

పరీక్షల కంటే ముందే ప్రవేశ పరీక్షలు

వెలువడని డిగ్రీ పరీక్షల షెడ్యూలు

చదువా? ఉన్నత విద్యా?

సందిగ్ధంలో  విద్యార్థులు

సాధారణంగా ఏ విద్యార్థి అయినా తాను చదువుతున్న కోర్సు పూర్తికాగానే ఎలాంటికోర్సులు చేయాలో నిర్ణయించుకునే ఉంటారు. ఉన్నత విద్య చదవాలనుకొనే వారు తాముచదువుతున్న కోర్సు చివరి సంవత్సరంలో అడుగుపెట్టినప్పటి నుంచే అందుకు తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకొని సిద్ధ్దమవుతారు. అయితే ఎస్వీయూ అధికారుల నిర్లక్ష్యం,రాష్ట్ర ఉన్నత విద్యామండలి అత్యుత్సాహం ఫలితంగా విద్యార్థుల ప్రణాళిక చెదిరింది.గుండె దడ మొదలైంది. భవిష్యత్‌పై భయం పట్టుకుంది. కెరీరా? ఉన్నత విద్య..చుదవుతున్న కోర్సు పూర్తి చేయడమా అన్న సందేహంతో డోలాయానంలో ఉన్నారు.

యూనివర్సిటీక్యాంపస్‌: డిగ్రీ విద్యార్థులకు తమ కెరీర్‌పై సందిగ్ధత పట్టుకుంది. ఎటు వెళ్లాలో నిర్ధారించుకోలేకపోతున్నారు.  జిల్లాలో సుమారు 150 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 30 వేల మంది డిగ్రీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. ఇప్పటివరకు డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించలేదు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎప్పటి నుంచి మొదలవుతాయో తెలీని పరిస్థితి. బుధవారంతోదరఖాస్తు గడువు ముగియనుంది. ఈ దశలో డిగ్రీ పూర్తయిన వారు పీజీ లేదా బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంసీఏ, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటారు. ఈ నెల 19 నుంచి వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు మొదలుకానున్నాయి. 19న ఎడ్‌సెట్, లాసెట్‌ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి మే 2న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

ఖరారు కాని షెడ్యూల్‌..
ఎస్వీయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ 6వ సెమిస్టర్‌ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న దశలో షెడ్యూల్‌ ప్రకటించలేదు. 25 నుంచి డిగ్రీ పరీక్షలు మొదలవుతాయని సమాచారం. డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ మధ్యలో ఐసెట్‌ ఉంటుంది. డిగ్రీ పరీక్షలు మొదలు కాక ముందే ఎడ్‌సెట్, లా సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. దీంతో డిగ్రీ పరీక్షలకు సిద్ధం కావాలా? లేక ప్రవేశ పరీక్షలకు తయారుకావాలా అని తల పట్టుకుం టున్నారు. సాధారణంగా డిగ్రీ విద్యార్థులు చివరి సంవత్సర పరీక్షలు పూర్తయ్యాక పీజీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ తదితర ఉన్నత కోర్సుల ప్రవేశ పరీక్షలు రాస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారుల అత్యుత్సాహం వల్ల డిగ్రీ పరీక్షలు రాయకమునుపే ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఇలా నిర్వహించటం ఇదే మొదటిసారి అని విద్యారంగ నిపుణులు అంటున్నారు.

ఒకే రోజు  రెండు ప్రవేశ పరీక్షలు..
రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎడ్‌సెట్‌ ఈ నెల 19న జరగనుంది. లా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ లాసెట్‌ కూడా ఈనెల 19న నిర్వహిస్తారు. దీనివల్ల రెండు పరీక్షలకు హాజ రయ్యే వారికి ఇబ్బంది తప్పదు. దీనిపై ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కుమార స్వామి దృష్టికి తీసుకెళ్లగా ఎడ్‌సెట్‌ ఉదయం, లా సెట్‌ సాయంత్రం ఉంటాయన్నారు. విద్యార్థులు ఒక పూట ఒకటి, మరోటి మధ్యాహ్నం రాయవచ్చన్నారు. ఈ షెడ్యూల్‌ రెండు నెలల క్రిందటే ప్రకటించామన్నారు. ఇప్పటివరకు అభ్యంతరాలు రాలేదన్నారు.

పీజీ ప్రవేశ ప్రకటనలు విడుదల..
జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, కుప్పంలోని ద్రవిడ విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిíఫికేషన్లు విడుదలయ్యాయి. ఎస్వీయూలో నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు సాగుతున్నాయి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పీజీ కోర్సులో చేరడానికి దరఖాస్తు తుది గడువు మే 5. మే 20 న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ లోపు డిగ్రీ పరీక్షలు ముగిసే అవకాశం లేదు. ద్రవిడ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి తుదిగడువు మే 31. ప్రవేశ పరీక్షలు జూన్‌ 6న నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు