చూసుకో.. రాసుకో..

21 Oct, 2019 10:22 IST|Sakshi
కారులో కూర్చుని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ఇష్టారాజ్యంగా సాగిన ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశ పరీక్ష

సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): ప్రైవేట్‌ పాఠశాలలో అడ్మిషన్‌ కోసం ఫిట్‌–జీ ప్రైవేట్‌ విద్యాసంస్థ ఆదివారం నిర్వహించిన పరీక్ష చర్చనీయాంశమైంది. స్థానిక పీఆర్‌ ప్రభుత్వ కళాశాల కేంద్రంలో ఈ పరీక్షకు దాదాపు వెయ్యిమంది వరకూ హాజరయ్యారు. ఆరు నుంచి  పదో తరగతి వరకూ ప్రవేశాలకు ఆ విద్యాసంస్థ ప్రవేశపరీక్ష నిర్వహించింది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా ఫీజులో రాయితీ ఉంటుందని ప్రకటించడంతో పరీక్ష నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకుని తమ సొంత కార్లలో, ప్రైవేట్‌ రూమ్‌లలో ఇష్టానుసారంగా పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లు లేకపోవడం, పూర్తిగా ప్రైవేట్‌ విద్యాసంస్థ కావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఈ పరీక్ష సాగుతున్న తీరును గమనించిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ‘ప్రైవేటు’ పద్ధతుల్లో పరీక్ష రాస్తున్న తల్లిదండ్రులను సెల్‌ఫోన్లతో ఫొటోలు తీయగా ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం చివరికి పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లింది. విజయవాడలో ఇదే పరీక్ష నిర్వహిస్తుండగా డీఈఓ పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష నిలిపివేసి, స్కూల్‌ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు. పత్రికల్లో భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చి ప్రతిభ చూపినవారికి ఉపకార వేతనాలతో పాటు ఫీజులు రాయితీ ఇస్తామని చెప్పి పరీక్ష ఇలా బహిరంగంగా నిర్వహించడం ఎంత వరకూ సమంజసనమని కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై ఆర్‌జేడీ నరసింహరావును వివరణ కోరగా కృష్ణా జిల్లాలో పరీక్ష రద్దుచేయాలని అదేశాలు జారీ చేశామని, పదో తరగతిలోపు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు. పూర్తి వివరాలు తెలసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు