రండి బాబూ..రండి!

24 Aug, 2019 07:43 IST|Sakshi

భర్తీకాని ఇంజినీరింగ్‌ సీట్లు

విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లిన కళాశాల యాజమాన్యాలు

ఆసక్తి చూపని విద్యార్థులు

మూడో విడత కౌన్సెలింగ్‌లోనూ నిరాశే

సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డలోని భూమా శోభా నాగిరెడ్డి మెమోరియల్‌ కాలేజీ అండ్‌ టెక్నాలజీలో మొత్తం 231 సీట్లు కౌన్సెలింగ్‌లో పెట్టారు. అయితే ముగ్గురు విద్యార్థులు మాత్రమే సీట్లు పొందారు.  ఓర్వకల్లు మండలంలో ఉన్న గీతాంజలి ఇంజినీరింగ్‌ కాలేజీలో 231 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా కంప్యూటర్‌ సైన్సు అండ్‌ ఇంజినీరింగ్‌లో 8మంది, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే సీట్లు అలాట్‌ అయ్యాయి. 

జిల్లాలో ఈ రెండు కాలేజీలే కాదు ఆరు కళాశాలల్లో 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి బతిమాలుతున్నాయి. తమ కళాశాలలో చేరాలని ప్రాధేయ పడుతున్నాయి. అయితే విద్యార్థులు ఉత్సాహం చూపడం లేదు. ఇంజినీరింగ్‌ విద్యకు ఒకప్పుడు చాలా డిమాండ్‌ ఉండేది. ఇటీవల కాలంలో బీటెక్‌ పూర్తి చేసినా కూడా ఉపాధి లేకపోవడం, చదువులో నాణ్యత లేకపోవడంతో ఆదరణ తగ్గుతోంది. ఈ విద్యా సంవత్సరం కొత్తగా రాయలసీమ యూనవర్సిటీలో ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభించారు. ఇది కాకుండా జిల్లాలో 14 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ పూర్తయ్యింది. జి.పుల్లారెడ్డి, జి.పుల్లయ్య, రవీంద్ర, రాజీవ్‌ గాంధీ మెమోరియల్, డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ ఉమెన్‌ కాలేజీల్లో అత్యధిక సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన కాలేజీల్లో ఒకటి రెండు బ్రాంచ్‌లు మినహా మిగిలిన వాటిలో పెద్దగా సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. 

జిల్లాలో 2,839 సీట్లు భర్తీ..  
జిల్లాలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 4,861 సీట్లు ఉన్నాయి. మొదటి, రెండో విడతల్లో కలిపి 2,839 మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు వచ్చిన వారు కాలేజీల్లో చేరారు. తరగతులు కూడా మొదలు అయ్యాయి. మిగిలి పోయిన సీట్ల కోసం ఈ నెల 21, 22 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయితే ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. మొదటి విడత తరువాత కొన్ని కళాశాల యాజమాన్యాలను ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ తమ కాలేజీల్లో చేరాలని కోరాయి. అయితే విద్యార్థులు ఆసక్తి చూపలేదు. 

మరిన్ని వార్తలు