స్కాలర్ తిప్పలు

11 Dec, 2013 00:55 IST|Sakshi
స్కాలర్ తిప్పలు

పిఠాపురం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్పులు వస్తాయో లేదో తెలీదు కానీ దానికి దరఖాస్తు చేయడానికి అవసరమైన ధ్రువపత్రాల మంజూరులో మాత్రం విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రాలు పొందడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేస్తోంది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం విద్యార్థులకు నరకం చవిచూపుతోంది.

  జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు 3,289 ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు 482 ఉండగా, ఉన్నత పాఠశాలలు 633 ఉన్నాయి. వాటిలో 1 నుంచి 5 వరకు చదువుతున్న విద్యార్థులు 2,40,526 మంది ఉండగా.. 6 నుంచి 10 వరకూ చదువుతున్నవారు 2,52,420 మంది ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2.80 లక్షల మంది ఉన్నారు. ఐదు నుంచి ఎనిమిదో  తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థికి ఏడాదికి రూ.1800; తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు రూ.2100 చొప్పున ఉపకార వేతనం ఇస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్పులు పొందారు.
 ఇదీ సమస్య
  స్కాలర్‌షిప్పుల కోసం గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు పొందారు. వీటిల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఆరు నెలలకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. కానీ, సాఫ్ట్‌వేర్ లోపంతో ఇది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాక, రెన్యువల్ కావడం లేదు. ఇలా రెన్యువల్ చేయించుకోవాల్సిన విద్యార్థులు జిల్లాలో సుమారు 4.50 లక్షల మంది ఉన్నారు.
  దీంతో ఆ విద్యార్థులు ఆదాయ ధ్రువపత్రం కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేశారు. వారికి ఈసేవ సిబ్బంది డూప్లికేట్ నంబర్‌తో ఆదాయ ధ్రువపత్రం ఇస్తున్నారు. కానీ రెన్యువల్ కాని విద్యార్థుల పేరిట గత ఏడాది జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రం అప్పటికే ఆన్‌లైన్‌లో ఉంటోంది. అది రెన్యువల్ కాకపోగా, సాఫ్ట్‌వేర్  లోపంతో కొత్తగా జారీ చేసిన డూప్లికేట్ పత్రం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కావడం లేదు.
  అయితే ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకున్న 50 వేల మందికి మాత్రం కొత్త యూనిక్ నంబర్లతో ఒరిజనల్ ధ్రువపత్రం ఇస్తున్నారు. అవి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవడంతో, కొత్తవారికి ఆదాయ ధ్రువపత్రాలు ఇవ్వడం సాధ్యమవుతోందని ఈసేవ సిబ్బంది చెబుతున్నారు. కేవలం పాతవారి ధ్రువపత్రాలను మాత్రమే సాఫ్ట్‌వేర్ తీసుకోవడం లేదని వారంటున్నారు. పాఠశాలలతో పాటు కళాశాలల విద్యార్థులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
  ఇప్పటికే రోజుల తరబడి ఈసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశామని, ఇప్పుడు వారిచ్చిన డూప్లికేట్ ధ్రువపత్రాలు నిరుపయోగంగా మారాయని, కొత్తగా దరఖాస్తు చేసినా ఫలితం ఉండడం లేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు