విద్యార్థులకు అస్వస్థత

13 Mar, 2020 13:24 IST|Sakshi
చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

హుటాహుటిన ఏరియా ఆసుపత్రిలో చికిత్స

త్వరితగతిన చర్యలు చేపట్టిన ఐటీడీఏ పీవో

కోలుకున్న విద్యార్థులు

చింతూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 45 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం కొంతమంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురవడంతో చికిత్స అందించారు.

తూర్పుగోదావరి, చింతూరు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 45 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 360 మంది విద్యార్థులుండగా ఉదయం విద్యార్థులతో ఐరన్‌(ఫెర్రస్‌ సల్ఫేట్‌ అండ్‌ ఫోలిక్‌ యాసిడ్‌) మాత్రలు మింగించారు. అనంతరం కిచిడీ, గుడ్డు, టమాటా పచ్చడితో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. కాగా మూడు గంటల సమయంలో కొంతమంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురవడంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు వారికి చికిత్స ప్రారంభించారు.

త్వరితగతిన చర్యలు చేపట్టిన పీవో
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పద్మజతో పాటు సమీప పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్న వైద్యులను అక్కడికి రప్పించి విద్యార్థులకు త్వరితగతిన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వైద్యులతో పాటు స్థానిక ప్రైవేటు వైద్యులు కూడా విద్యార్థులకు వైద్యం అందించేందుకు సాయపడ్డారు. ఈ సందర్భంగా పీవో వెంకటరమణ ప్రతి వార్డుకు వెళ్లి విద్యార్థులకు ధైర్యం చెబుతూ ఆందోళన చెందవద్దంటూ భరోసా కల్పించారు. దీంతో సాయంత్రానికి విద్యార్థులంతా క్రమంగా కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా తమ పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి చేరుకుని వారి యోగక్షేమాలు చూసుకున్నారు. ఒక్కసారిగా చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో భయానికి లోనైన విద్యార్థులు ఆసుపత్రిలో బోరున విలపించారు. 

భోజనం వికటించడమే కారణమా?
మద్యాహ్న భోజనం తిన్న అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో భోజనం వికటించిన కారణంగానే ఇది జరిగి ఉంటుందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. పెసరపప్పుతో కూడిన కిచిడీతో పాటు గుడ్డు, టమాటా చట్నీ ఇవ్వడంతో అది తిన్న విద్యార్థులకు సరిగా అరగక అస్వస్థకు గురై ఉంటారని వైద్యులు తెలిపారు. కాగా కిచిడీ సరిగా ఉడక లేదని ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా బాగానే ఉడికింది. ఏం ఫర్వాలేదని చెప్పడంతో తామంతా తిన్నామని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, గురువారం రాత్రి వారిని ఆసుపత్రిలోనే పర్యవేక్షణలో ఉంచి శుక్రవారం వైద్యుల సూచనల మేరకు ఇళ్లకు పంపిస్తామని పీవో వెంకటరమణ తెలిపారు. విద్యార్థులు తిన్న ఆహారాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నామని, వచ్చిన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

మరో 12 మంది విద్యార్థులకు..
చింతూరు: మండలంలోని నరసింహాపురం బాలుర ఆశ్రమ పాఠశాలలోని మరో 13 మంది విద్యార్థులు గురువారం రాత్రి ఆస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేశాక వారికి వాంతలు  మొదలయ్యాయి. ఏఎన్‌ఎం మాత్రలు మింగించడంతో వారిలో 10 మంది కొంత వరకు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీవో వెంటనే ఆ హాస్టల్‌కు వెళ్లి  ఆ 12 మంది విద్యార్థులను వాహనంలో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు