బరబరా లాగి.. ఈడ్చుకెళ్లి...

5 Oct, 2013 02:56 IST|Sakshi

 వైవీయూ, న్యూస్‌లైన్ :  తెలంగాణ నోట్ ఆమోదంపై యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ) విద్యార్థి జేఏసీ ఉడికిపోయింది. ఊహించని ఈ పరిణామంతో విద్యార్థులు మూకుమ్మడిగా తరలివచ్చి కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(ఇందిర భవన్) ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు విద్యార్థులు తరలివచ్చారు. అయితే వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దీంతో విద్యార్థులు సహనం కోల్పోయి ఇందిరభవన్‌పై రాళ్ల వర్షం కురిపించారు. ఇక అంతే. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అడ్డొచ్చిన వారిని గొడ్డులను బాదినట్లు బాదారు.
 
 అయినా విద్యార్థి జేఏసీ నాయకులు తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటూ ఇందిరాభవన్ ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైవీయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ బి.అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ 65 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహంతో ఊగిపోయారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అడ్డుకోవాలని చూడటం పోలీసులకు తగదన్నారు. అంతలోనే అక్కడికి చేరుకున్న కడప డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి ఏమాత్రం లోచించకుండా విద్యార్థులను ఈడ్చుకెళ్లే యత్నం చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఇందిరా భవన్‌లోకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. ఒకానొక దశలో తీవ్ర స్థాయిలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.
 
 పోలీసులు విచక్షణా రహితంగా విద్యార్థులతో విరుచుకుపడ్డారు. విద్యార్థులను కొట్టుకుంటూ, ఈడ్చుకెళ్లారు. డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి ‘గుద్దుతా నా కొడకల్లారా..’ అంటూ విద్యార్థులను బండ బూతులు తిడుతూ దొరికిన వాడిని దొరికినట్లు పట్టుకుని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. వారికి మద్దతుగా వచ్చిన ఆర్టీసీ ఎన్‌ఎంయూ నేత శివారెడ్డిని సైతం పోలీసులు ఈడ్చుకువెళ్లే యత్నం చేశారు. ఎన్జీఓ అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి జోక్యంతో ఆయన్ను విడిచిపెట్టారు. అయితే వైవీయూ విద్యార్థి జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు కడప స్టేషన్‌కు తరలించడకుండా వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరిశోధక విద్యార్థులపై ఇష్టానుసారం లాఠీచార్జి చేయడం తగదంటూ ఆందోళనకు దిగారు. మరో నలుగురు విద్యార్థులను రిమ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు