పల్లె చదువులు దైన్యం..పట్నానికి పయనం

23 Sep, 2019 07:14 IST|Sakshi

విద్యార్థుల వలసల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం

గ్రామీణ ప్రాంతాల్లో కొరవడిన వసతులు.. అందని 

నాణ్యమైన విద్య  పదేళ్లలో 62 శాతం పెరిగిన వలసలు  

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతికి

అధిక డిమాండ్‌  కేంద్ర ప్రభుత్వ గణాంకాల స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి : ఉద్యోగం, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు సహజం. చదువుల కోసం కూడా వలసలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్యా సంస్థలు లేకపోవడం, నాణ్యమైన విద్య అందకపోవడమే ఇందుకు కారణం. మంచి చదువులు చెప్పించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టణాలు, నగరాలకు పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మరింత అధికంగా ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. చదువుల కోసం వలసలు వెళ్తున్న విద్యార్థుల విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతిఏటా 54.50 లక్షల మంది విద్యార్థులు తాము పుట్టిన జిల్లాల నుంచి చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం చదువుల కోసం వలస వెళ్లిన విద్యార్థులు ప్రతిఏటా 33.60 లక్షలు. అంటే పదేళ్లలో ఈ సంఖ్య 62 శాతం పెరిగింది. 2011 నుంచి ఇప్పటిదాకా ఈ సంఖ్య భారీగా పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెట్రో నగరాలకు వలసలు అధికంగా ఉన్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఈ వలసలు కనిపిస్తుండడం గమనార్హం. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లోని ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈ తాకిడి ఎక్కువగా ఉంది. మెట్రో నగరాలకు సగం మంది వెళ్తుండగా, మిగతా సగం మంది సమీపంలోని పట్టణ ప్రాంత విద్యాసంస్థల్లో చేరుతున్నారు.  

గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సంస్థలు నిర్వీర్యం  
గత టీడీపీ సర్కారు నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యా సంస్థలు బలహీనపడ్డాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, సిబ్బందిని సైతం నియమించకపోవడంతో అవి దాదాపు నిర్వీర్యమయ్యాయి. టీడీపీ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఏర్పాటుకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసింది. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీల ఏర్పాటుకు ముందుగా అనుమతులు తీసుకుని, కొద్దికాలం తరువాత వాటిని పట్టణ ప్రాంతాలకు షిఫ్టింగ్‌ పేరిట తరలిస్తున్నాయి. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 400కు పైగా విద్యాసంస్థల షిఫ్టింగ్‌కు అనుమతులు ఇవ్వడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థలను ప్రభుత్వమే నీరుగార్చడంతో మెరుగైన విద్యకోసం మరో గత్యంతరం లేక తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టణాలు, నగరాలకు పంపుతున్నారు.  

10–19 ఏళ్లలోపు  విద్యార్థులే అధికం 
దేశవ్యాప్తంగా చదువుల కోసం వేరే ప్రాంతాలను ఆశ్రయిస్తున్న వారిలో 81 శాతం మంది 10 నుంచి 29 ఏళ్ల లోపు వారున్నారు. 25 శాతం 10–14 ఏళ్ల వారు, 33 శాతం 15–19 ఏళ్ల వారు, 18 శాతం మంది 20–24 ఏళ్ల వయసు వారున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 10–19 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోని విద్యా సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వీరు చదువుల కోసం పదేళ్లకు మించి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడమో లేదా అక్కడే ఉండడమో చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. పుట్టి పెరిగిన చోట ప్రాథమిక విద్య పూర్తిచేసిన వారు పై చదువులకోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లక తప్పడం లేదు.   

మరిన్ని వార్తలు