పర్యావరణహిత ఫ్రిజ్.. వాటర్ లీకేజీ అలారం!

2 Mar, 2014 01:23 IST|Sakshi
పర్యావరణహిత ఫ్రిజ్.. వాటర్ లీకేజీ అలారం!

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్తు అవసరం లేకుండానే పనిచేసే ఎకో ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్‌తోపాటు యూఎస్‌బీ కాఫీ హీటర్, వాటర్ లీకేజీ అలారమ్, సోలార్ చార్జర్‌లను తయారు చేసి బంజారాహిల్స్‌లోని ముఫఖం జా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. కాలేజీ ఈ-సెల్ విభాగానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు షాజాద్, అజహర్, సాలికలు తాము తయారు చేసిన ఈ వస్తువులను శనివారం కళాశాల ఆవరణలో ప్రదర్శించారు. చెక్క పెట్టె, మట్టి కుండ, బొగ్గులను ఉపయోగించి తాము తయారుచేసిన పర్యావరణ హిత రిఫ్రిజిరేటర్ గ్రామాల్లో బాగా పనిచేస్తుందని, దీనిలో ఆహార పదార్థాలను మూడు రోజుల వరకూ నిల్వ ఉంచవచ్చని వారు తెలిపారు. ఈ ఫ్రిజ్‌ను ప్రయోగాత్మకంగా చిలుకూరు గ్రామంలో వినియోగించనున్నట్లు వెల్లడించారు.

 

అలాగే కాఫీ చల్లారకుండా ఉండేలా యూఎస్‌బీతో పనిచేసే కాఫీ హీటర్ కంప్యూటర్లపై పనిచేసేవారికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ఏవైనా సంస్థలు ముందుకొస్తే వాటి సహకారంతో వీటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు