విద్యార్థి గల్లంతు

23 Feb, 2015 01:06 IST|Sakshi

గంగ కాలువలో మునిగిపోయిన బాలుడు
 
సత్యవేడు: తెలుగుగంగ కాలువలో పడి గురుకుల పాఠశాల విద్యార్థి గల్లంతైన సంఘటన సత్యవేడులో ఆదివారం చోటుచేసుకుంది. సత్యవేడులోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సదుం మండలం పొలికిమాకులపల్లికి చెందిన ఎస్.ధరణీశ్వర్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆదివారం ఉదయం ఆరు గంటలకు వ్యాయామం అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు స్నేహితులైన హర్షవర్ధన్ (6వతరగతి), జగదీష్(5)తో కలిసి పాఠశాల వెనుకవైపునున్న తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లారు. నీరు తెచ్చుకోకపోవడంతో కాలకృత్యాల అనంతరం ధరణీశ్వర్ గంగ కాలువలో దిగాడు. కాలుజారి కాలువలో పడిపోయాడు. కాలువలోని చిన్నపాటి చెట్టును పట్టుకుని కేకలు వేశాడు. ఈ విషయాన్ని గమనించిన మిగిలిన ఇద్దరు పిల్లలు అరచినా అక్కడ ఎవరూ లేకపోవడంతో లాభం లేకపోయింది. కొద్దిసేపటికే పట్టువీడి ధరణీశ్వర్ నీటిలో మునిపోయాడు. ఆ ఇద్దరు పిల్లలు హాస్టల్‌కు చేరుకుని విషయం చెప్పారు. డ్రిల్ మాస్టర్, ఉపాధ్యాయులు పరుగున అక్కడికి చేరుకున్నారు. బాలుడి జాడ లేకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉందని, వెతకడం కష్టమని చెప్పి వెళ్లిపోయారు. ఎంపీపీ చొరవ తీసుకుని స్థానికంగా ఉన్న ఈతగాళ్లను పిలిపించి సాయంత్రం ఆరు గంటల వరకు వెతికించినా విద్యార్థి ఆచూకీ కనిపించలేదు.

విద్యార్థి గల్లంతుపై సీఎం ఆరా

చిత్తూరు(సెంట్రల్): సత్యవేడులో గురుకుల పాఠశాల విద్యార్థి తెలుగుగంగ కాలువలో పడి గల్లంతైన విషయమై సీఎం చంద్రబాబునాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవీంద్ర ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ఆదేశించారు. ఘటనపై విచారణకు, విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించేందుకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు