కష్టాల చదువు

9 Dec, 2013 04:42 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: సర్కారు అనాలోచిత నిర్ణయాల వల్ల ఆధార్ కార్డు అంటేనే విద్యార్థులు బెంబేలెత్తున్నారు. ఆధార్ నమోదుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది నుంచి రెన్యువల్, ఫ్రెష్ స్కాలర్‌షిప్‌లు పొందాలంటే విద్యార్థులకు ఆధార్ కార్డు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ ఇవ్వలేమని కొర్రీలు విధించింది. ఈ నిబంధనలతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికీ రెన్యువల్  విద్యార్థుల్లో మూడోవంతు వారికి మాత్రమే ఆధార్ కార్డు (యూఐడీ నంబర్) అందగా..  ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. మిగిలిన వారికి ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి.
 ఇదీ పరిస్థితి...
 జిల్లాలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో 95,992మంది రెన్యువల్ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు అర్హత సాధించారు. వీళ్లంతా ఇంటర్.. ఆపై స్థాయి కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు 69,650మందికి ఆధార్ కార్డులు అందాయి. వీరంతా యూఐడీ నంబర్ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నారు. అంటే ఆధార్ కార్డులు ఉన్న విద్యార్థులు 72.55 శాతం మంది ఉన్నారు. మిగిలిన 26,342 మంది విద్యార్థులు అందుకు నోచుకోలేకపోయారు. వాస్తవంగా జూన్ నుంచి ఆధార్ నమోదు ప్రక్రియ సాగుతోంది. నెలలు గడుస్తున్నా విద్యార్థులకు యూఐడీ నంబర్ ఇవ్వడంలో సర్కారు తీవ్రంగా విఫలమైంది.
 ఫ్రెష్ విద్యార్థులు...
 అన్ని సంక్షేమ శాఖల పరిధిలో 2013-14 ఏడాదికి మరో 75వేల మంది ఇంటర్.. ఆపై కోర్సుల్లో చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వీరందరికీ ఆధార్ తప్పనిసరి. ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డులు అందినవారు యూఐడీ నంబర్ నమోదు చేసుకుంటున్నారు. చాలామంది నుంచి అధికారులు వివరాలు సేకరించినా కార్డులు వారికి చేరలేదు. అయితే వీరికి, రెన్యువల్ విద్యార్థులకు నెమ్మదిగా ఆధార్ వివరాల సేకరణ జరిగితే వచ్చే మార్చిలోగా కూడా ఈ ప్రక్రియ ముగియకపోవచ్చని అధికారులు అంటున్నారు.
 దిక్కులేని వెరిఫికేషన్...
 ఈ ఏడాదిలో ఇప్పటివరకు విద్యార్థుల ధ్రువపత్రాల వెరిఫికేషన్ మొదలు కాలేదు. గతేడాదిలో ఈ సమయానికి ప్రక్రియ ముగిసిపోయింది. విద్యార్థుల ధ్రువపత్రాలు, ఉత్తీర్ణత శాతం, చేస్తున్న కోర్సు తదితర వివరాలు సరైనవేనా? కాదా అని వెరిఫికేషన్ అధికారులు తేల్చాల్సి ఉంటుంది. ఒక్కో అధికారికి విద్యార్థుల సంఖ్యను బట్టి నాలుగైదు కళాశాలలు అప్పగిస్తారు. వీరు కళాశాలలకు వెళ్లి ధ్రుపత్రాలు పరిశీలిస్తారు. అయితే ఈ ఏడాది వెరిఫికేషన్ ప్రారంభించాలని అధికారులకు సర్కారు నుంచి ఇప్పటికీ ఆదేశాలు రాలేదు. అయితే ఆధార్ నమోదు పూర్తయితేనే వెరిఫికేషన్ మొదలు పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఒక్కో కళాశాలలో ఉన్న విద్యార్థులంతా యూఐడీ నంబర్ ఈ-పాస్‌లో నమోదు చేస్తేనే వెరిఫికేషన్ ఏకకాలంలో పూర్తవుతోంది. కేవలం ఆధార్ కార్డు ఉన్న విద్యార్థుల ధ్రువపత్రాలే పరిశీలించాలంటే కుదరని పని. దీనిపై స్పష్టత లేకపోవడంతో అధికారులే అయోమయంలో పడ్డారు.
 మూలుగుతున్న నిధులు..
 రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కోసం విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అటు వెరిఫికేషన్ మొదలు కాక, ఇటు యూఐడీ నంబర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా నిధులున్నా స్కాలర్‌షిప్ అందని దుస్థితి. కచ్చితంగా యూఐడీ నంబర్ నమోదు చేస్తేనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని సర్కారు మొండిగా వ్యవహరిస్తోంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమశాఖల పరిధిలో స్కాలర్‌షిప్ కింద దాదాపు *10.50 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు *12 కోట్లు ఉన్నాయి. వెరిఫికేషన్ పూర్తయితే నిధులను కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. అంటే నిధులున్నా విద్యార్థులను సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

మరిన్ని వార్తలు