హెచ్‌ఐవీపై విద్యార్థి వినూత్న ప్రచారం

15 Dec, 2013 00:18 IST|Sakshi

చేగుంట, న్యూస్‌లైన్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణపై ఓ బాలుడు వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఒకటిన అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఒక్క రోజు కార్యక్రమాలతో మార్పు రాదని గమనించిన చేగుంటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాయి సాకేత్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు.

తనకు సమయం చిక్కినప్పుడల్లా ప్లకార్డుతో చేగుంట, వడియారం గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం వడియారం గ్రామంలో హెచ్‌ఐవీ నివారణ కోసం ప్లకార్డు ప్రదర్శిస్తూ కనిపించాడు. ఎయిడ్స్/హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ వస్తే ఎలాంటి చికిత్స పొందాలో స్థానికులకు వివరిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారుల కన్నా ఈ విద్యార్థి ప్రచారమే బాగుందని అతడి ప్రయత్నాన్ని స్థానికులు అభినందించారు.
 

>
మరిన్ని వార్తలు