చదువుకోలేకపోతున్నాం..

21 Oct, 2018 10:33 IST|Sakshi
ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి సమస్య వివరిస్తున్న ఎం.డి.సలీం, జననేత జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న విద్యార్థులు

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ వినతి

జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన విద్యార్థులు

ప్రజా సంకల్పయాత్ర బృందం : పదో తరగతి వరకు మా ఊరిలో చదువుకున్నా ఇంటర్, డిగ్రీ చేయాలంటే పదుల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు తమ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని బొబ్బిలి మండలం  పారాది వద్ద రామభద్రపురం మండలానికి చెందిన డబ్ల్యూవీఎన్‌ రాములు, తదితర విద్యార్థులు శనివారం కలిసి సమస్య విన్నవించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటర్, డిగ్రీ చదువుకోవాలని ఉన్నా స్థానికంగా కళాశాలలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలి వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే  రామభద్రాపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

చేతివృత్తుల కార్మికులను ఆదుకోవాలి..
చేతివృత్తుల కార్మికులను ఆదుకోవాలనని విశాఖపట్నానికి చెందిన ఎం.డీ సలీం కోరారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయన పలు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో చేతివృత్తి కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. 16 రాష్ట్రాలకు చెందిన చేతివృత్తుల వారు ఒకచోట ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతులు వచ్చాయని తెలిపారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత ఆ ఫైల్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఎక్కడ ప్రదర్శనా కేంద్రాలు ఏర్పాటు చేసినా అద్దె రూపంలో వేలది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రదర్శనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు