భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

22 Oct, 2017 13:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆదివారం కూడా కార్పొరేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తుండటాన్ని నిరసిస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. భారతీనగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఉదయం నుంచి తరగతులు నిర్వహిస్తుండటంతో సమాచారం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకొని.. ధర్నాకు దిగాయి.  ఆదివారం క్లాసులు నిర్వహించొద్దని ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రోజులకే రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో తరగతులు ఎలా నిర్వహిస్తారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.  

కొనసాగుతున్న నిరసనలు..
కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల మరణాలపై  నిరసనలు  కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడపలో విద్యార్థి సంఘాలు నిరవధిక నిరాహార దీక్షకు దిగాయి.  విద్యార్థులను యంత్రాల్లా చదివిస్తూ కేవలం ర్యాంకుల కోసం పరితపిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలను వెంటనే మూసివేయాలని కోరుతూ.. నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలో చేరిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీ.ఆర్.కళాశాల సెంటర్‌లో మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంత్రి పదవి నుంచి నారాయణను తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు తమ ధోరణిని మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

గుంటూరులో..
కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్‌బోర్డు నిబంధనలకు అనుగుణంగానే తరగతుల నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఆర్‌ఐవో కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బోర్డు మార్గదర్శకాలను కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ఒక్క విద్యాసంస్థపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్‌ బోర్డు పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా