కళాశాలల్లో ‘నిషా పెన్‌’ !

21 Oct, 2019 11:42 IST|Sakshi
ఈ-సిగరేట్‌ పెన్స్‌

సాక్షి, అమరావతి బ్యూరో : ఈ–సిగరెట్‌.. దీనిపై కేంద్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీ నుంచి నిషేధం విధించింది. అయినప్పటికీ రాజధాని నగరం విజయవాడలో వీటి అమ్మకాలు, కొనుగోళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని ఓ కళాశాలలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడిచేయగా ఈ–సిగరెట్ల బాగోతం వెలుగుచూసింది. విద్యార్థులు గంజాయితోపాటు వీటిని కూడా వినియోగిస్తున్నట్లు బహిర్గతమైంది. ప్రస్తుతం వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, నిల్వ, పంపిణీ, ప్రచారం అన్నిటిపైనా నిషేధం అమలులో ఉంది. కానీ నగరంలో చాపకింద నీరులా ఈ–సిగరెట్‌ విక్రయాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 

ఎంతో ప్రమాదం.. 
ధూమపానం ప్రస్తుతం ఓ ఫ్యాషన్‌గా మారింది. ఊపిరితిత్తుల వ్యాధులతో మృతి చెందుతున్న వారిలో పొగ బాధితులే అధికం. పొగ ఊపిరితిత్తులకు చేరుకోగానే, గుండె ఎక్కువ శ్రమించాలి. సాధారణం కంటే ఇది 10–25 నిమిషాలు అదనంగా కొట్టుకోవాలి. రక్తపోటులో హెచ్చుతగ్గులు కన్పిస్తాయి. ప్రతి దమ్ముకు రక్తపోటు 10–15 శాతం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఆస్పత్రులకు వస్తున్న నోటి క్యాన్సర్‌ రోగుల్లో 40 శాతం పొగాకు బాధితులే. ఇంట్లో పొగ తాగే వారి కారణంగా మిగతా సభ్యులూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆస్తమా, దగ్గు, ఇతర ఊపిరితిత్తుల ఇబ్బందులతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇక 1 నుంచి 10 సిగరెట్లు తాగేవారిలో క్యాన్సర్‌ ప్రమాదం 20 శాతం ఉండగా 11–20 శాతం వరకు పీల్చేవారిలో 31 శాతం.. 21 ఆపైన 57 శాతం ఉంది. 

ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ అంటే..
సాధారణ సిగరెట్లలో నికోటిన్, అసిటోన్, అమెనియా, ఆర్సెనిక్, బెంజిన్, బ్యూటేన్, కాడ్మియం, కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రోజన్‌ సైనేడ్, మిథనాల్, నాఫ్తలీన్, నికెల్, ప్రొపైన్, స్టిరియారిక్‌ ఆమ్లం తదితర రసాయనాలు నేరుగా మనిషి దేహంపై ప్రభావం చూపుతాయి. ఇక ఈ–సిగరెట్‌ను ఎలక్ట్రానిక్‌ నికోటిన్‌ డెలివరీ సిస్టమ్‌(ఈఎన్‌డీఎస్‌) అని వ్యవహరిస్తారు. దీనిలో నికోటిన్‌ మాత్రమే కాక ప్రొపైలిన్‌ గ్లెకాల్‌ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కారకమని వైద్యులు చెబుతున్నారు. ద్రవ రూపంలో ఉన్న నికోటిన్‌ ఎలక్ట్రానిక్‌ పరికరంలో ఉంటుంది. అందులో బ్యాటరీ అమర్చి ఉంటుంది. నోట్లో పెట్టుకొని పీల్చినప్పుడు బ్యాటరీ నికోటిన్‌ను మండిస్తుంది. దీర్ఘంగా పీల్చే అవకాశం ఉంటుంది. దీంతో ధారాళంగా పొగ ఊపిరితిత్తులకు చేరి శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి అలవాటు పడితే బయటకు రావడం కష్టమే. తొలుత ఒక దమ్ము.. రానురాను రోజుకు 10–20 దమ్ముల వరకు వెళుతుంది. దీనిని మానేసేందుకు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచనలతో నికోటిక్‌ ఛూయింగ్‌గమ్‌తో పాటు నికోటిక్‌ ప్యాచ్‌ వాడితే కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. 

                                                       నిషా పెన్‌ ఇదే 
ఇంజినీరింగ్‌ విద్యార్థులే అధికం..
విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్, స్వయంప్రతిపత్తి విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నారు. ఇటీవల కాలంలో కిలోల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. విచారణలో ఇది విద్యార్థుల కోసం రవాణా చేసినట్లుగా తేలింది. తాజాగా ఈ–సిగరెట్‌ విక్రయాలు, వినియోగం కూడా సాగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు