ఉన్నత చదువులకు ఊతం

23 Mar, 2019 12:57 IST|Sakshi
పాదయాత్రలో విద్యార్థినుల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(ఫైల్‌)

వైఎస్‌ జగన్‌తోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పునరుజ్జీవం

జననేత హామీపై విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం

వైఎస్సార్‌ ఆశయానికి బాబు తూట్లు పొడిచారని మండిపాటు

అరకొరనిధులిచ్చి అవస్థలపాలు చేశారని ఆగ్రహం

యూనివర్సిటీ క్యాంపస్‌: పేదరికం కారణంగా ఫీజులు చెల్లించలేక ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కావద్దని దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2008లో ప్రవేశపెట్టిన ఈ పథకానికి రూ. 2 వేల కోట్లు కేటాయించారు.  మహానేత మరణంతో ఈ పథకం నీరుగారిపోతోంది. ప్రస్తుత ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు.

జిల్లాలోని  విద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు సైతం పలుమార్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిర్వహణపై పత్రికా సమావేశాల్లో ధ్వజమెత్తారు. తిరుపతిలోని టీటీడీ, ఇతర సంస్థల్లో విద్యార్థులు కూడా పలుమార్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలోని అతి పెద్ద యూనివర్సిటీ అయిన ఎస్వీయూలో 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించిన నిధులు కూడా సరిగా రాలేదు.  ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు లబ్ధిదారులను తగ్గించడానికి పలు ఆంక్షలు విధించడంతో పథకం నీరుగారి పోతోంది. గతంలో సెమిస్టర్‌ మొత్తానికి 75 శాతం హాజరు నిబంధన ఉండేది. ప్రస్తుతం ప్రతి నెలా 75 శాతం హాజరు నిబంధన పెట్టడం వల్ల చాలా మంది విద్యార్థులు ఈ పథకానికి దూరమవుతున్నారు. ఎస్వీయూ క్యాంపస్‌లోనే సుమారు 700 మంది విద్యార్థులు ఈ నిబంధనతోనే పథకం లబ్ధిపొందలేకపోయారు.

జననేత హామీతో..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌  రెడ్డి తన పాదయాత్రలో అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులు పడుతున్న బాధలు విన్నారు. నేనున్నాను అంటూ వారికి   ఫీజుల భారాన్ని తగ్గిస్తానని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని హామీ  ఇచ్చారు. ఈ హామీతో విద్యార్థులకు భవిష్యత్‌పై భరోసా లభించినట్లయింది.

కొంత మాత్రమే..
2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి మా కళాశాలలో చదివిన విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పటికీ రాలేదు. గత నెలలో ఆందోళన చేస్తే కొంత మందికి విడుదల చేశారు. మిగిలిన వారికి ఎప్పుడు వస్తుందో తెలియదు.         – నవీన్, ఎస్‌జీఎస్‌ డిగ్రీ కళాశాల, తిరుపతి

అన్న రావాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌   పూర్తి స్థాయిలో   అమలు   కావాలంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కావాలి. ఆయన కూడా తన తండ్రి ఆశయాలు కొనసాగించగలరు. ఉన్నత చదువులు ఎలాం టి దిగులు లేకుండా పూర్తి చేయవచ్చు. – మస్తాన్, డిగ్రీ విద్యార్థి, తిరుపతి

పూర్తి ఫీజు ఇవ్వాలి
వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో పూర్తి ఫీజు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం  పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడం లేదు. బీటెక్‌ ఫీజు రూ.లక్ష ఉంటే గరిష్టంగా రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల ఈ పరిమితిని పెంచినప్పటికీ పెద్దగా ఉపయోగం లేదు.   – షాలిని, బీటెక్, తిరుపతి

జగనన్నతోనే న్యాయం
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితే ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుంది. పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌  చేస్తానని జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రకటించారు. దీంతో  విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఉన్నత విద్యను కొనసాగించవచ్చు.   – మౌనిక, బీఎస్సీ అగ్రికల్చర్, తిరుపతి

మరిన్ని వార్తలు