బస్సుల కోసం విద్యార్థుల నిరసన

18 Jul, 2019 11:35 IST|Sakshi
టాప్‌పై వేలాడుతూ కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు   

సాక్షి, రేగిడి(శ్రీకాకుళం) : విద్యార్థులకు రవాణా కష్టాలు మరింత కష్టతరం కావడంతో  రోడ్డెక్కుతున్నారు. కళాశాలలకు వెళ్లే సమయంలో చాలినన్ని బస్సులు నడపకపోవడంతో ఇటీవల ఉణుకూరులో ఆందోళన చేపట్టిన ఘటన మరవక ముందే తోకలవలస జంక్షన్‌ వద్ద బుధవారం పలు గ్రామాల విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ మేరకు మండలంలోని తోకలవలసతోపాటు లింగాలవలస, వావిలవలస, బుడితిపేట, చిన్నశిర్లాం తదితర గ్రామాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రెండు బస్సులు మాత్రమే తిరుగుతున్నాయని, పాలకొండ నుంచి ఉంగరాడమెట్టకు వచ్చేసరికే పరిమితికి మించిన ప్రయాణికులతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.  

ఈ విషయమై పలుమార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయం తెలుసుకున్న రేగిడి పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళను విరమింపజేశారు. ఆ సమయంలోనే పాలకొండ నుంచి రాజాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు విద్యార్థులు టాప్‌పైన ప్రయాణించే ప్రయత్నం కూడా చేశారు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతూ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుందని, ఆర్టీసీ అధికారుల ఇప్పటికైనా స్పందించి అదనపు బస్సులను నడపాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు