రాష్ట్ర విభజన జరిగితే రీయింబర్స్‌మెంట్ ఎలా?

28 Oct, 2013 08:19 IST|Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే లక్షలాదిమంది పేద విద్యార్థుల ఉన్నత చదువులతో ముడిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేశారు. అయితే ఇప్పటికే కుంటుతున్న ఈ పథకం భవిష్యత్తుపై తాజా పరిణామాల నేపథ్యంలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమలు విషయంలో ఎలాంటి అనుమానాలూ లేకపోయినా, అమలు తీరు ఎలా ఉంటుందనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
 
 

ముఖ్యంగా హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచిన నేపథ్యంలో హైదరాబాద్‌లో చదువుకునే సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు ఏ ప్రభుత్వం చెల్లిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే హైదరాబాద్‌లో చదువుకునే విద్యార్థులను కూడా ప్రాంతాల వారీగా విభజించి ఏ ప్రాంతానికి చెందిన వారికయ్యే ఖర్చును ఆ రాష్ట్రం చెల్లిస్తుందా? లేక తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వానికి నిధులిచ్చి చెల్లించమంటుందా? లేక తానే చెల్లిస్తానంటుందా? ఇతర రాష్ట్రాల్లో చదివే విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలల్లో చదివితేనే ఫీజుల పథకం వర్తిస్తుందనే నిబంధనను ఎలా అమలుచేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
 ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువమంది
 
 ప్రస్తుతం ఫీజుల పథకం అమలవుతున్న తీరును పరిశీలిస్తే ఏటా ఈ పథకం కింద 26 లక్షల మందికిపైగా లబ్ధి పొందుతుండగా, ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే దాదాపు 10 లక్షల మంది ఈ పథకం ద్వారా చదువుకుంటున్నారు. వృత్తివిద్య, ఇతర కళాశాలల సంఖ్య రాజధాని శివార్లలో ఎక్కువగా ఉండడంతో పాటు నాణ్యమైన విద్య అందే పరిస్థితి ఉండడంతో ప్రతిభ ఉన్న విద్యార్థులంతా ఇంతవరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలనే ఎంచుకుంటున్నారు.
 
 ఈ పరిస్థితుల్లో తెలంగాణతో పాటు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ జిల్లాల్లో చాలా ఎక్కువగానే ఉంటారని అంచనా. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే దాని పరిధినిబట్టి ఎన్ని కళాశాలలు ఉమ్మడి రాజధాని పరిధిలోనికి వస్తాయనేది స్పష్టం కానుంది. అలా ఉమ్మడి రాజధాని పరిధిలోనికి వచ్చే కళాశాలల్లో చదువుకునే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ఫీజును ఏ ప్రభుత్వం చెల్లిస్తుందన్నది ప్రశ్నగా మిగలనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ కళాశాలలో చదివినా రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుండగా, మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో చదివితే మాత్రం... అన్ని కళాశాలలకూ ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు.
 
 భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన దాదాపు 200 కళాశాలల్లో చదివితేనే ఫీజును చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అయినా సీమాంధ్రకు హైదరాబాద్‌ను ఇతర రాష్ట్రంగానే పరిగణిస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి తెలంగాణలోని ఏ కళాశాలలో సీమాంధ్ర ప్రాంత విద్యార్థులున్నా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పథకం అమలు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరిపై ఆధారపడి ఉన్నప్పటికీ.. అన్ని కళశాలలకూ ఈ పథకం వర్తించేలా మార్పు చేస్తే సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు కూడా వైజాగ్, తిరుపతి, కర్నూలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రదేశాల్లో చదువుకుంటున్నారు. వేరే రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అనే అంశం వీరికి కూడా వర్తించనుంది. విభజన జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి చూడాల్సిందేనని సంక్షేమ శాఖల అధికారులు అంటున్నారు.
 
 డబ్బులెలా చెల్లిస్తారు?
 
 ఒకవేళ ఫీజులు ఏ ప్రభుత్వం చెల్లిస్తుందన్న దానిపై స్పష్టత వచ్చినా ఎలా చెల్లిస్తారన్నది కూడా ఆసక్తిగా మారనుంది. హైదరాబాద్‌లో చదువుకునే సీమాంధ్ర విద్యార్థులకు ఆ ప్రభుత్వమే ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నా, ఆన్‌లైన్‌లో ట్రెజరీల ద్వారా బ్యాంకులకు ఫీజు ఎలా వెళుతుందన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. ఎందుకంటే ఆయా జిల్లాల సంక్షేమ శాఖల అధికారులు, ట్రెజరీ అధికారులతో ఫీజుల చెల్లింపు ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి నిధులు చెల్లిస్తే, వాటిని సీమాంధ్ర విద్యార్థులకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఇదే పరిస్థితి సీమాంధ్ర ప్రాంతంలో చదువుకునే తెలంగాణ విద్యార్థులకూ ఎదురుకానుంది. ఇప్పటికే అనేక ఆంక్షలు, నిబంధనలతో అతలాకుతలమవుతున్న ఫీజుల పథకం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటుందో అనే సందేహాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు