సబ్‌కలెక్టర్ మెడకు కుల ధ్రువీకరణ వివాదం ?

13 Aug, 2014 01:42 IST|Sakshi
సబ్‌కలెక్టర్ మెడకు కుల ధ్రువీకరణ వివాదం ?

సాక్షి ప్రతినిధి, విజయనగరం : కుల ధ్రువీకరణ అంశం ఐఏఎస్ అధికారిణిని ఇబ్బందుల్లోకి నెట్టనుందా? సాలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌పీ భంజ్‌దేవ్ గిరిజన కులస్తుడేనంటూ జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో పార్వతీపురం సబ్ కలెక్టర్  చిక్కుల్లో పడ్డారా? భంజ్‌దేవ్ కొండదొర అంటూ ఆగమేఘాలపై ధ్రువీకరించి వివాదంలో ఇరుక్కున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. గవర్నర్ హౌస్ నుంచి వచ్చిన విచారణ ఆదేశాలు అందుకు ఊతమిస్తున్నాయి.  సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని 2006 మార్చి 10న హైకోర్టు తీర్పునిచ్చింది.
 
 ఈ తీర్పుపై భంజ్‌దేవ్ స్టే కోరినా కోర్టు తిరస్కరించింది.  దీంతో భజంద్‌దేవ్‌కు మంజూరు చేసిన ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, న్యాయవాది  రేగు మహేశ్వరరావు.. కలెక్టర్, సబ్‌కలెక్టర్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే ప్రభుత్వ మెమో ద్వారా సాలూరు తహశీల్దారుతో దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.  భంజ్‌దేవ్, అతని కుటుంబంపై విచారణ చేసి ఇతను గిరిజన కులానికి చెందని వారని సాలూరు తహశీల్దారు నిర్ధారించి,  డాక్యుమెంట్లతో సహా సబ్‌కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని  ఆప్పటి ఆర్డీఓ స్వయంగా విచారణ చేసి భంజ్‌దేవ్ క్షత్రియుడని నిర్ధారించినట్టు తెలిసింది.
 
 అయితే పెండింగ్‌లో ఉన్న భంజ్‌దేవ్ కుల వివాదం ఇటీవల ఎన్నికల ముందు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ ఏడాది మార్చి 29న ఆర్పీ భంజ్ దేవ్ గిరిజనుడేనంటూ పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి తనంతట తానుగా ఆదేశాలు జారీ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇదే వివాదంపై మళ్లీ  రేగు మహేశ్వరరావు  గవర్నర్, రాష్ట్రపతిని కలసి కుల వివాదాన్ని వివరించారు. ఇప్పుడు దానిని గవర్నర్ పరిశీలించి విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బయటకు లాగితే, పిటీషనర్ల ఆరోపణలు నిజమైతే సబ్ కలెక్టర్ ఇబ్బందుల్లో పడతారన్న వాదన విన్పిస్తోంది. 

మరిన్ని వార్తలు