సొంతింటిలో చేరకుండానే... 

23 Jun, 2019 08:07 IST|Sakshi

సాక్షి, ఆదోని(కర్నూలు) : సొంతింటితో చేరకుండానే ఓ ఉద్యోగిని మృత్యువు కబళించింది. గృహం నిర్మించుకొని ప్రవేశ పూజల్లో నిమగ్నమై ఉన్న అతన్ని విద్యుదాఘాతం రూపంలో అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఆదోనిలో శనివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజ మండలం సింధనూరు గ్రామానికి చెందిన రవీంద్రబాబు(55) పత్తికొండ సబ్‌జైల్‌ హెడ్‌గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదోని సబ్‌జైల్‌ గార్డుగా పనిచేస్తూ ఏడాది క్రితం హెడ్‌గార్డుగా పదోన్నతిపై పత్తికొండ సబ్‌జైలుకు వెళ్లాడు. అయితే ఆదోని నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. భార్య అర్లమ్మ ఆలూరు ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.

ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో మంచి ఇల్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు. అందులో భాగంగా దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసి ఆర్టీసీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఆదివారం గృహ ప్రవేశం ఉండటంతో  బంధువులందరికీ కబురంపాడు. పూజల్లో భాగంగా శనివారం పండితులతో హోమం తలపెట్టాడు. హోమంలో కూర్చున్న రవీంద్రబాబు విద్యుత్‌ తీగ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటి పెరట్లోని మోటార్‌కు సంబంధించిన వైరు అడ్డుగా ఉందన్న కారణంతో పూజలో నుంచి బయటకు వచ్చి వైరు చుట్టగా చుట్టి గోడపై పెట్టే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కుప్ప కూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  

శుభ కార్యం జరగాల్సిన చోట రోదనలు.. 
గృహప్రవేశం పిలుపుతో పలువురు దగ్గరి బంధులు రావడంతో అప్పటి వరకు సందడిగా ఉండేది. కాగా ఇంటి యజమనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని సొంతగ్రామం సింధనూరుకు తీసుకెళ్లడంతో శుభ కార్యం జరగాల్సిన ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది.    

మరిన్ని వార్తలు