సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. ప్చ్..‘మామూలే’!

15 Jan, 2015 04:03 IST|Sakshi
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. ప్చ్..‘మామూలే’!

విజయనగరం రూరల్:  రాష్ట్ర విభజన నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. ఇదే అదునుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మామూళ్ల వసూలు పర్వం  పతాక స్థాయికి చేరుకుంది. భూములకు గిరాకీ పెరగడంతో జోరుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే రిజిస్ట్రేషన్లు జరగడం లేదని క్రయ విక్రయదారులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.  
 
 ఏడాదికి రూ.20 కోట్ల వరకు వసూలు
 క్రయవిక్రయదారుల నుంచి అనధికారికంగా ఏడాదికి ముడుపుల రూపంలో రూ.20 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు వరకు రిజిస్ట్రేషన్ల ఫీజు 0.5 శాతం ఉంటే ప్రభుత్వానికి సుమారు రూ.10కోట్ల ఆదాయం లభించింది. అదే ఒక్కో డాక్యుమెంటుకు రిజిస్ట్రేషన్ చేయాలంటే ముడుపుల రూపంలో ఒకశాతం క్రయవిక్రయదారులు సమ ర్పించాల్సిందే. ముడుపులు చెల్లించనిదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటును సిబ్బంది గానీ, అధికారులు గానీ ముట్టడం లేదని క్రమవిక్రయ దారులు ఆరోపిస్తున్నారు. భూముల ధరలు పెంచి ప్రభుత్వం ఫీజు వసూలు చేస్తుండడంతో ముడుపుల రూపంలో తడిపిమోపెడవు తోందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 అనధికారిక సిబ్బందే కలక్షన్ కింగ్‌లు
 జిల్లావ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు 30 మంది వరకు అనధికార సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని నియమించడానికి ప్రభుత్వం నుంచి గాని జిల్లా అధికారుల నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకపోయినా సబ్ రిజిస్ట్రార్లు వారికి అనుకూలురైన వ్యక్తులను నియమించుకుని వారితోనే మామూళ్లు వసూలు చేయిస్తున్నారని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం విశేషం. ప్రతి నెలా ముడుపుల రూపంలో అందుకున్న మొత్తాన్ని జిల్లా అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు పంపకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కిందిస్థాయి సిబ్బంది  ఒక్కొక్కరూ ప్రతిరోజూ ఇంటికి వెళ్లేటప్పుడు మూడు వందలు తీసుకుని వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బందే రూ.మూడు వందలు ఇంటికి పట్టుకు వెళితే అధికారులకు ఎంత చేరుతుందో, ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 అధికారుల బంధువులే డాక్యుమెంట్ రైటర్లు
 గతంలో కేవలం లెసైన్స్ ఉన్న డాక్యుమెంట్ రైటర్లే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఎవరైనా డాక్యుమెంట్లు రాయవచ్చని ఆదేశాలు రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు వారి బంధువులను, స్నేహితులను, వారి రక్త సంబంధీకులను డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకుని వారితోనే పనులు కానిచ్చేస్తున్నారు. వీరే అధికారులకు క్రయవిక్రయదారులకు మధ్యవర్తులుగా ఉండి మామూళ్లు వసూలు చేసిపెడుతున్నారు. వారు తెచ్చిన డాక్యుమెంట్లకు ఎటువంటి ఆంక్షలు లేకుండా  రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ వారి దగ్గరే డాక్యుమెంట్లు తయారు చేయించుకోవడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఇదే వృ త్తిపై జీవిస్తున్న డాక్యుమెంటు రైటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 అధికారులు స్పందించాలి
 జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న వసూళ్ల పర్వంపై జిల్లా ఉన్నతాధికారులు, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్‌శాఖకు బదిలీపై వచ్చిన అధికారులు  దృష్టి సారించి నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు