18 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు

16 Mar, 2019 07:35 IST|Sakshi

హాజరు కానున్న 6.21 లక్షల మంది విద్యార్థులు

2,839 కేంద్రాల్లో ఏర్పాట్లన్నీ పూర్తి

ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా 22వ తేదీ నాటి పరీక్ష ఏప్రిల్‌ 3కి మార్పు

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిర్దేశిత సమయానికి చేరుకోవాలి 

తాగునీరు, టాయిలెట్స్, ఇతర మౌలికసదుపాయాలన్నీ సిద్ధం

ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. 2,839 పరీక్షా కేంద్రాలలో జరిగే ఈ పరీక్షలకు 6,21,634 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణపై విజయవాడ గొల్లపూడిలోని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేశామన్నారు. 11,690 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 6,21,634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వీరిలో 3,18,524 మంది బాలురు 3,03,110 మంది బాలికలున్నారని చెప్పారు. వీరిలో 1,803 మంది దివ్యాంగ విద్యార్థిని, విద్యార్థులకు అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, పరీక్షలు రాసేందుకు వారికి ఒక గంట ఆదనపు సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు 156 ఫ్లయ్యింగ్‌ స్క్వాడ్లు, 289 సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించామన్నారు. సమస్యాత్మకమైన 209 పరీక్షా కేంద్రాలలో నిశితంగా పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

నిరంతరం మంచినీటి సౌకర్యం
ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చోని పరీక్షలను రాసే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. నిరంతరం మంచినీటి సరఫరా చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలను నిర్వహించారని, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపి రవాణా సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈఏపీ.జీవోవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 0866–2974540 లేదా 18005994550 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. 22న శాసనమండలి సభ్యుల ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఆరోజు జరగవలసిన పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు.

పిల్లలను సమయానికి పరీక్ష కేంద్రానికి పంపండి
తల్లిదండ్రులు తమ పిల్లలకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను సందర్శించి ప్రతిరోజూ సరైన సమయానికి వారిని పరీక్ష కేంద్రానికి చేరుకొనేలా చూడాలన్నారు. విద్యార్థులు రోజూ ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాయడానికి విద్యార్థులు, రైటింగ్‌ ప్యాడ్, పెన్నులు, పెన్సిల్స్, రబ్బరు, స్కేల్‌ వగైరా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలలో సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించబోమన్నారు. విద్యార్థులు ఎటువంటి స్కూల్‌ యూనిఫారంతో పరీక్షలకు హాజరుకాకూడదన్నారు. విద్యార్థులను బూట్లతో రాకూడదన్నారు.

మరిన్ని వార్తలు