సాగర గర్భంలో లోయలు..!

5 Jul, 2020 04:12 IST|Sakshi

విశాఖ–భీమిలి మధ్య 15 వరకు ‘సబ్‌మెరైన్‌ కానియాన్స్‌’

ఎన్‌ఐవో శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగులోకి

వాటి స్థితిగతులపై అధ్యయనానికి నేవీ ఆసక్తి

వీటిలో జలాంతర్గాములను భద్రపరిచే అవకాశాలపై పరిశీలన

ఈ లోయల్లో చమురు, సహజ వాయువు నిక్షేపాలకూ ఆస్కారం!

సాక్షి, అమరావతి బ్యూరో: సాగర గర్భం అనేక అద్భుతాలకు నిలయం. ఎన్నో వింతలు, విశేషాలకు ఆలవాలం. అలాంటి సముద్రంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అదీ ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో! కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం సమీపంలో!! ప్రపంచంలోనే అత్యంత అరుదుగా సాగర గర్భంలో ఏర్పడే లోయలు (కానియాన్స్‌) మన బంగాళాఖాతంలోనూ ఉన్నట్టు జాతీయ సముద్ర అధ్యయన సంస్థ (ఎన్‌ఐవో) శాస్త్రవేత్తల పరిశోధనలో కొన్నాళ్ల క్రితం గుర్తించారు. ఇవి దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న తూర్పు నావికాదళానికి ఉపయోగపడేలా అడుగులు పడుతున్నాయి. అంతేకాదు.. ఆ ప్రాంతంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఆసక్తి రేపే ఆ లోయల విశేషాలివీ! 

సింధు సాధనతో అన్వేషణ..
భూమ్మీద మాదిరిగానే సముద్ర గర్భంలోనూ లోయలు, గుహలు ఏర్పడతాయి. వీటిని సబ్‌మెరైన్‌ కానియాన్స్‌ (సాగర గర్భంలో ఉండే లోయలు)గా పిలుస్తారు. ఇలాంటివి ప్రపంచం మొత్తమ్మీద 600 వరకు ఉన్నట్టు ఇప్పటివరకు గుర్తించారు. ఎన్‌ఐవో శాస్త్రవేత్తలు మనదేశంలోని సముద్ర జలాల్లోనూ కొంతకాలం క్రితం అత్యాధునిక పరిశోధన నౌక ‘సింధు సాధన’తో ఇలాంటి అన్వేషణలు చేపట్టారు. వీరి అన్వేషణలో బంగాళాఖాతంలో విశాఖపట్నం– భీమిలి మధ్య తీరానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో సాగర గర్భంలో ఉన్న లోయలను కనుగొన్నారు. ఇవి సముద్ర నీటికి 300 మీటర్ల దిగువన 18 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయని గుర్తించారు. ఇలాంటివి 15 వరకు ఉన్నాయని, ఒక్కొక్కటి 0.5 కి.మీ. నుంచి కి.మీ. వెడల్పు, 2 కి.మీ. పొడవు కలిగి ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ లోయలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు.

దేశంలోనే తొలిసారి వెలుగులోకి..
ప్రపంచంలో ఇతర దేశాల సాగర గర్భాల్లో ఇప్పటికే కొన్నిచోట్ల సబ్‌మెరైన్‌ కానియాన్స్‌ను కనుగొన్నారు. మన దేశ సముద్ర గర్భంలో లోయలను గుర్తించడం ఇదే ప్రథమం. ఇలాంటివి మన దేశానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక సముద్రాల దిగువన ఉన్నాయి. 

ఎలా ఏర్పడతాయి?
వేలు, లక్షల సంవత్సరాల క్రితం నదులు వేగంగా ప్రవహిస్తూ సముద్రంలో కలవడం వల్ల కోతకు గురై ఇలాంటి లోతైన కానియాన్స్‌ ఏర్పడతాయని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నాళ్లకు అవి శిలల మాదిరిగా గట్టిదనాన్ని సంతరించుకుంటాయి. ప్రవాహ వేగానికి కొట్టుకొచ్చిన మొక్కలు, చెట్లు  వంటివి సాగరం అడుగున ఉండిపోవడం వల్ల అక్కడ చమురు, సహజ వాయువుల నిక్షేపాలకు నిలయంగానూ మారుతుంది. కాలక్రమంలో సముద్ర మట్టాలు పెరిగి ముందుకు రావడంతో ఈ లోయలు కంటికి కనిపించకుండా సాగర గర్భాల్లో ఉంటున్నాయి. ఈ లోయల ప్రాంతంలో చమురు, సహజ వాయువులుండేందుకు ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సాగర లోయల్లో అరుదైన, విభిన్న జాతుల మత్స్య సంపద ఉండవచ్చని కూడా వీరు అంచనా వేస్తున్నారు. 

నావికాదళం ఆసక్తి..
ఎన్‌ఐవో శాస్త్రవేత్తలు కనుగొన్న సముద్ర లోయలపై భారత నావికాదళం ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే విశాఖలో తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం ఉంది. దీనికి సమీపంలోనే ఈ లోయలున్నాయి. దీంతో జలాంతర్గాముల (సబ్‌మెరైన్ల)ను భద్రత రీత్యా ఈ లోయల్లో ఉంచేందుకు అనువుగా ఉంటుందా? అనే అంశంపై నేవల్‌ రీసెర్చి బోర్డు (ఎన్‌ఆర్‌బీ) ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఏడాదిలో ప్రాజెక్టు చేపట్టే అవకాశం
విశాఖ తీరానికి సమీపంలో సాగర గర్భంలో కనుగొన్న లోయలు అత్యంత అరుదైనవి. ఇలాంటివి బయల్పడటం దేశంలో ఇదే ప్రథమం. నేవీకి చెందిన అమూల్యమైన పరికరాలను భద్రత పరిచే అవకాశాలపై ఈ లోయల పటిష్టత, స్థితిగతులపై అధ్యయనం చేయాల్సి ఉంది. అలాగే ఆ లోయల్లో ఎలాంటి మత్స్య సంపద ఉంది? చమురు, సహజ వాయువు నిక్షేపాల ఉనికిపైనా దృష్టి సారిస్తాం. అన్నీ అనుకూలిస్తే ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. 
    – వీవీఎస్‌ఎస్‌ శర్మ, సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, ఎన్‌ఐవో

మరిన్ని వార్తలు