‘కాంగ్రెస్‌ నేతలు డ్రామాలు ఆడుతున్నారు’

29 Dec, 2019 12:38 IST|Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై పరువునష్టం దావా వేయాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం టీటీడీ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. వాటిపైన సిట్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ఏళ్ల తరబడి శ్రీవారి సేవలో ఉన్న అర్చకులను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ఆ అర్చకులకు అవకాశమివ్వడం శుభపరిణామమన్నారు.

ఏ ప్రభుత్వం అజమాయిషీ లేకుండా టీటీడీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్తుడని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించారు. టీటీడీని అన్యమతస్థులతో నింపారని ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై పరువు నష్టం దావా వేయాలని పేర్కొన్నారు. టీటీడీ నిధులపై ఆడిటింగ్‌ లేకపోవడంతో నిధులు పక్కదారి పట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ నిధులు కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు దావా: టీటీడీ

వలసదారులకు ఎన్డీయే పౌరసత్వం కల్పిస్తోంది..
భారతదేశంలో వుండి కూడా పౌరసత్వం లేక పనిచేసే అవకాశం కోల్పోతున్న వారిని  ఆదుకొని, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని కనుగొని వారికి మన దేశ పౌరసత్వం  పొందే అవకాశం ఉందా లేదా అని పరిశీలించడమే ఎన్నార్సీ ప్రధాన ఉద్దేశ్యమని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. భారతీయ ముస్లింలకు ఇది నష్టం కలిగిస్తుందన్నదాంట్లో వాస్తవం లేదన్నారు. ఎన్నార్సీకి అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌(కాంగ్రెస్‌) అంగీకరించారని గుర్తు చేశారు. కానీ దీనిపై కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సుదీర్ఘ కాలంగా జీవిస్తున్న వలసదారులకు ఎన్డీయే పౌరసత్వం కల్పిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై అనవసర విద్వేశాలు రెచ్చగొట్టడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు.

మరిన్ని వార్తలు