పెట్టుబడి రాయితీపై కోటి ఆశలు

14 Jun, 2017 11:22 IST|Sakshi
పెట్టుబడి రాయితీపై కోటి ఆశలు

► ఏటా లబ్ధిదారుల ఎంపికలో విపక్ష
► సాంకేతిక కారణాలు కొంత అడ్డంకి
► మంజూరైనా అందని సబ్సిడీ


కరువు సీమలో ఏ కాస్త సాయమందినా రైతుకు ఎంతో ఊరట. వరుసగా పంటలను కోల్పోయి పెట్టుబడికి పైసాలేనివారికి ఇది భరోసా. అయితే ఏటా ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటిస్తున్నా కంటితుడుపుగానే ఉంటోంది. కొండంత నష్టపోతే పిసరంత సహాయం అందుతోంది. అది కూడా సాంకేతిక కారణాలతో కొందరికి రెండేళ్లుగా అందడం లేదు. మరో పక్క అధికార పార్టీ తమ అనుయాయులకే ఇందులో అగ్రాసనమేస్తోందన్న అపప్రథ బలంగా ఉంది. ఈనేపథ్యంలో బుధవారం నుంచి విడుదల కానున్న పెట్టుబడి రాయితీపై మరోసారి అన్నదాత ఆశగా ఎదురుచూస్తున్నాడు.

చిత్తూరు (కలెక్టరేట్‌): వేరుశనగ పంట కోల్పోయిన తమకు ప్రభుత్వమిచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఈ సారైనా సక్రమంగా అందుతుందా అని రైతులు సందేహిస్తున్నారు. రెండేళ్లుగా సబ్సిడీ నిధులు అధికార పార్టీకి చెందిన వారికే దక్కాయని ఆవేదన చెందుతున్నారు. తాజాగా  రూ. 163 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని బుధవారం నుంచి అందించనున్నట్లు సర్కారు ప్రకటించింది. రైతులు ఏటా ఖరీఫ్‌లో వర్షాధార పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావంతో ఏ ఏడాదికాయేడాది పంటను నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నష్టపరిహారం కింద రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందిస్తోంది. 

2014లో 83 వేల హెక్టార్లలో వేరుశనగ పంట నష్టపోయినట్లు గుర్తించారు. రూ.90 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రకటించారు. 2015లో 80 వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు గుర్తించి రూ. 128 కోట్లు విడుదల చేశారు. మంజూరైందంతా రైతులకు చేరడం లేదు. 2014లో రూ.79 కోట్లు,  2015కు సంబంధించి ఇప్పటి వరకు రూ.110 కోట్లు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమయింది. మిగిలిన నిధులు చేరలేదు. ఆన్‌లైన్‌లో సాంకేతిక లోపాల వల్ల రైతులు నష్టపోయారు. దీనికితోడు రెండేళ్లుగా చాలా మంది అర్హులైన లబ్ధిదారులకు ఈ సాయం అందలేదనే విమర్శలున్నాయి. అధికార పార్టీకి అనుకూలమైన వారికి మాత్రమే రెవెన్యూ సిబ్బంది ఇన్‌పుట్‌ సబ్సిడీ వర్తించేలా లెక్కలు వేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై పలుమార్లు ప్రజా వాణిలో కలెక్టరేట్‌ ఎదుట రైతులు ధర్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

జిల్లాకు రూ. 163 కోట్లు మంజూరు
గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లా రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పంట పూర్తిగా చేజారింది. లక్ష హెక్టార్లలో పంటను రైతులు నష్ఠపోయారని వ్యవసాయశాఖ అధికారులు నివేదికల్లో తేల్చారు. ఈమేరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ప్రతిపాదించారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ దఫా రూ.163 కోట్లు కేటాయించినట్లు సమాచారం. బుధవారం నుంచి ఈనిధులను  రైతుల ఖాతాల్లో జమచేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ దఫా అయినా అర్హులైనవారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని రైతాంగం ఎదురుచూస్తోంది.

>
మరిన్ని వార్తలు