22న సీఎం చేతుల మీదుగా

18 May, 2020 04:04 IST|Sakshi

ఎంఎస్‌ఎంఈలకు రాయితీలు

రెండు విడతలుగా రూ.904.89 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ

పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం వెల్లడి 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.904.89 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించనున్నారు. ఇందులో మొదటి విడత మే 22న అందించనున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం తెలిపారు. పారిశ్రామిక బకాయిలతోపాటు రూ.188 కోట్ల విలువైన విద్యుత్‌ డిమాండ్‌ చార్జీల రద్దు, రుణ వితరణ కోసం రూ.200 కోట్ల కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రయోజనాలు పొందే వారిని గుర్తించి వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని సుబ్రహ్మణ్యం చెప్పారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రీ స్టార్ట్‌ ప్యాకేజీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తామని తెలిపారు. విద్యుత్‌ డిమాండ్‌ చార్జీల రద్దు, కొత్త రుణాలు కోరుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని, వీటిని పరిశీలించాక ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తామన్నారు. ఈ దరఖాస్తు ఉన్న వారికి విద్యుత్‌ డిమాండ్‌ చార్జీలను వెంటనే రీయింబర్స్‌ చేస్తామన్నారు. ఏపీలోని అన్ని పరిశ్రమలకు ఆధార్‌ సంఖ్యను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనివల్ల సెక్టార్‌ల వారీగా పరిశీలించడానికి, ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందని, ఈ  కార్యక్రమాన్ని 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ పరిశ్రమలను జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని భారీ, పెద్ద పరిశ్రమలతో, బ్యాంకులతో ఎంఎస్‌ఎంఈలను అనుసంధానం చేస్తామన్నారు.

పరిశ్రమ ఆధార్‌ అంటే.. 
రాష్ట్రంలోని పరిశ్రమలకు 11 డిజిట్లలో ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ నంబర్‌ చూడగానే అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ, ఏ జిల్లాలో ఉంది అనే వివరాలను సులువుగా గుర్తించవచ్చు. ఈ 11 డిజిట్లలో మొదటి మూడు జిల్లాను, తర్వాత రెండు మండలాన్ని సూచిస్తాయి. ఆ తర్వాత సంఖ్య ఏ రంగానికి చెందిన పరిశ్రమ అనే విషయాన్ని తెలుపుతుంది. చివరి 5 డిజిట్ల సీరియల్‌ నంబర్‌ ఉంటుంది. 

మరిన్ని వార్తలు