పేదలకు సబ్సిడీ రుణాలిస్తాం

13 Nov, 2018 03:57 IST|Sakshi

మెగా రుణమేళాలో సీఎం చంద్రబాబు 

సాక్షి, అమరావతి: సబ్సిడీ రుణాలు ఇవ్వడం ద్వారా పేదలను ఆదుకుంటామని సీఎం  చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో మెగా రుణమేళాను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన లబ్ధిదారుల సభలో మాట్లాడారు. వచ్చే రుణమేళాలో ఈబీసీలకు కూడా మేలు చేస్తామన్నారు. బీసీలకు ఆధునిక పనిముట్లు ఇవ్వడం ద్వారా వృత్తుల్లో మరింత రాణించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఎస్టీల్లో చైతన్యం లేదని, వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గిరిజన యువకుడు శ్రావణ్‌కుమార్‌కు గిరిజన మంత్రితో పాటు కుటుంబ సంక్షేమ శాఖను కేటాయించిన ఘతన టీడీపీదేనన్నారు. అబ్దుల్‌ కలామ్‌ను దేశాధ్యక్షుడిని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. డప్పు కళాకారులు, చెప్పులు కుట్టుకునే వారికి కొత్తగా పింఛన్‌ ఇస్తున్నట్లు చెప్పారు. పలు పథకాల ద్వారా పేదరిక నిర్మూలన, పోషకాహారలోపాన్ని పోగొట్టేందుకు చర్యలు చేపట్టినట్లు  చెప్పారు.

కార్పొరేషన్‌ల వారీగా నాలుగు నెలల్లో పంపిణీ చేయబోయే లబ్ధిదారులు, నిధుల వివరాలు వివరించారు. మొత్తంగా మొదటి విడత రెండు లక్షల యూనిట్లు, రూ. 1697.5కోట్ల నిధులతో పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సానుకూల ప్రభుత్వం దేశంలో రావాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. సభ ప్రారంభానికి ముందు జ్యోతి వెలిగించి పేదరికంపై గెలుపు లోగోను ఆవిష్కరించారు. సభానంతరం ఆదరణ వస్తువులు, కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీ రుణాలు లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు.

సభలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుతో పాటు ఇతర మంత్రులు దేవినేని ఉమా, మహమ్మద్‌ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి ఉదయలక్ష్మి, బీసీ కార్పొరేషన్‌ ఎండీ ఎం రామారావు, ఎస్సీ కార్పొరేషన్‌ వైఎస్‌ చైర్మన్‌ జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్, విజయవాడ నూతన సబ్‌కలెక్టర్‌ మిషాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, రుణమేళాలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తున్నామని చెప్పడం దానికి ఓ ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లకు మాత్రమే చట్టబద్ధత ఉందని, బీసీ సబ్‌ప్లాన్‌ గైడ్‌లైన్స్‌ కూడా ఇంతవరకు తయారు కాలేదని చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడం అంటే బీసీలను దగా చేయడమేనని విమర్శిస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు