రైతును వీడని ఆన్‌లైన్‌ కష్టాలు

17 Jun, 2019 12:17 IST|Sakshi
ఆన్‌లైన్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్న రైతులు

భూముల వివరాలు ఆన్‌లైన్‌ చేయడంలో నిర్లక్ష్యం చూపిన టీడీపీ ప్రభుత్వం

విత్తనాలు అందక రైతుల ఆందోళన

సాక్షి, బలిజిపేట (విజయనగరం): గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను ఇంకా అవస్థలకు గురిచేస్తోంది. భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ సంవత్సరాలు గడిచినా నేటికీ పూర్తికాకపోవడంతో సబ్సిడీ విత్తనాలకు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో సబ్సిడీ విత్తనాలు అందక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందంటున్నారు. గత ప్రభుత్వం ‘మీ ఇంటికి–మీ భూమి’ కార్యక్రమాన్ని పెట్టి ఊదర్లు కొట్టింది తప్పా కార్యాచరణ పూర్తిచేయలేదని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు అవసరమైనన్ని విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు పొందాలంటే భూమి ఆన్‌లైన్‌ జరగడం, ఆన్‌లైన్‌ అయిన భూమికి ఆధార్‌ అనుసంధానం అవడం తప్పనిసరి కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మండలంలో ఖరీఫ్‌ సీజనులో సాగు విస్తీర్ణం 6వేల హెక్టార్లు. అవసరమైన విత్తనాలు 4,500 క్వింటాళ్లుగా అంచనా. ప్రభుత్వం, వ్యాపారులు కలిపి వీటిని అందించాల్సి ఉంది.నిబంధనల ప్రకారం ప్రభుత్వం సరఫరా చేయనున్న విత్తనాలు 35శాతం. కాగా మండలానికి వచ్చిన సబ్సిడీ విత్తనాలు 2,080.50 క్వింటాళ్లు. కాగా ప్రైవేటు వ్యాపారులు పెట్టిన ఇండెంట్‌ 2,450 క్వింటాళ్లు. కాగా వచ్చిన సబ్సిడీ విత్తనాలలో విక్రయించినవి 1,275క్వింటాళ్లు. మిగిలి ఉన్నవి 805 క్వింటాళ్లు. ఖరీఫ్‌కు సాగుచేయనున్న రైతులు 20వేల మంది కాగా భూములు ఆన్‌లైన్‌ అయినవారు 60శాతం మాత్రమే ఉన్నారు. భూములు ఆన్‌లైన్‌ అయినవారిలో ఆధార్‌ అనుసంధానం కాని రైతులు 30 శాతం వరకు ఉన్నారని తెలుస్తోంది.

భూములు పూర్తిగా ఆన్‌లైన్‌ కాని రైతులు 40 శాతం వరకు ఉన్నారు. ఈలెక్కన ఆన్‌లైన్‌ అవక నష్టపోతున్న రైతులు చాలావరకు కనిపిస్తున్నారు.  వీరు ప్రైవేటుగా విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.  ఆన్‌లైన్‌ అంటూ గత ప్రభుత్వంలో చాలావరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక బ్యాంకు రుణాలు పొందేటపుడు ఆన్‌లైన్‌ జరగని, ఆధార్‌లింక్‌ అవని భూములకు సంబంధించి రుణాలు పొందే అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలు సంభవించేటప్పుడు అసలైన రైతులు నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి ఆన్‌లైన్‌ వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు.

ఆన్‌లైన్‌ కాకపోవడంతో విత్తనాలు అందడం లేదు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ అన్నారు తప్పా భూములను ఆన్‌లైన్‌ చేయలేదు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. విత్తనాలు కావాలన్నా, ప్రభుత్వ లబ్ధి పొందాలన్నా ఆన్‌లైన్, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అవడంతో నష్టపోయాం.
–వెంకటరమణ, నూకలవాడ, బలిజిపేట మండలం

ఖరీఫ్‌కు అన్నీ కొత్తవిత్తనాలే
ప్రస్తుత ఖరీఫ్‌కు అన్నీ కొత్త విత్తనాలే అవడంతో సాగుచేస్తున్న ప్రతిరైతూ విత్తనాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం రైతులు పండించిన పంటలో విత్తనాలను కడితే వచ్చే సీజనుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. 
– నాగేశ్వరరావు, ఏఓ, బలిజిపేట

మరిన్ని వార్తలు