కఠిన ‘పరీక్ష’

5 Jan, 2014 02:24 IST|Sakshi
కఠిన ‘పరీక్ష’

=పూర్తికాని సిలబస్
 =వేధిస్తున్న సబ్జెక్ట్ టీచర్ల కొరత
 =డెప్యుటేషన్ నియామకాలు అంతంతమాత్రమే
 =ప్రారంభం కాని నైట్‌విజన్ కార్యక్రమం
 =విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి

 
సాక్షి, చిత్తూరు: జిల్లాలో 629 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఈ ఏడాది 51,477 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి 27 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని 25 శాతం పాఠశాలల్లో సిలబస్ పూర్తి కాలేదు. శ్రీకాళహస్తి, సత్యవేడు, పూతలపట్టు, మరికొన్ని మండలాల్లో సోషల్, ఇంగ్లిషు, తెలుగు పండిట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లను డెప్యుటేషన్‌పై నియమించుకుని పాఠాలు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఈ నియామకాలు పూర్తిగా జరగలేదు. పలు పాఠశాలల్లో టీచర్లు సిలబస్ అయిందనిపిస్తున్నారు.

ఈ వేగంలో పాఠాలను అర్థం చేసుకోవడం విద్యార్థులకు శక్తికి మించిన పనిగా మారుతోంది. ఇంకొన్ని పాఠశాలల్లో పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన ప్రశ్నలను మాత్రమే చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులు సాయంత్రం పూట ఇంటి వద్దే ఉండి చదువుకునేలా టీచర్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రోత్సహించేలా నైట్ విజన్ కార్యక్రమం చేపట్టాలని డీఈవో ఆదేశించారు. అయితే ఈ కార్యక్రమం చాలాచోట్ల ప్రారంభం లేదు.
     
 సత్యవేడులో పరీక్షలకు 40 రోజుల ముందే సిలబస్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు బోధన వేగవంతం చేశారు. అయితే ఈ వేగాన్ని విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ, తెలుగు పండిట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాసుకుప్పంలో సోషల్ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు 90 శాతం సిలబస్ పూర్తయింది. రోజువారి పరీక్షలు, తరగతుల నిర్వహణతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది.
     
 పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె బాలుర ఉన్నత పాఠశాలలో 60 శాతమూ సిలబస్ పూర్తి కాలేదు. చాలా తక్కువ పాఠశాలలో మాత్రం రివిజన్ జరుగుతోంది.
     
 పూతలపట్టు నియోజకవర్గంలో 11 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పూతలపట్టు ఉన్నత పాఠశాల సైన్‌‌స టీచర్ మంత్రి పీఏగా డెప్యుటేషన్‌పై వెళ్లారు. దీంతో విద్యా వాలంటీర్‌తో పాఠాలు చెప్పిస్తున్నారు.
     
 పీలేరు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి కావొచ్చింది. రాత్రి సమయాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
     
 మదనపల్లెలో ఐదు జెడ్పీ ఉన్నత పాఠశాల లు ఉన్నాయి. చాలాచోట్ల డిసెంబర్ మొదటి వారానికే సిలబస్ పూర్తయింది. అర్ధ సంవత్సరం పరీక్షల తర్వాత రివిజన్ జరగనుంది. సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటున్నారు.
     
 శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 43 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 1649 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పిల్లమేడు, పెద్దకనపర్తి ఉన్నత పాఠశాలల్లో సోషల్ టీచర్లు లేరు. చాలాచోట్ల సిలబస్ అయిందనిపిస్తున్నారు.
     
 నగరిలోని దాదాపు అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేశారు. సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
     
 చంద్రగిరి, పాకాలలో 75 శాతం సిలబస్ పూర్తయింది. మిగిలిన సిలబస్‌ను జనవరి నెలాఖరులోపు పూర్తి చేస్తామని టీచర్లు చెబుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 

మరిన్ని వార్తలు