గిరిజనులపై ఇంత నిర్బంధమా?

10 Feb, 2016 23:18 IST|Sakshi

బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకునేందుకే అక్రమ అరెస్టులు అమాయక గిరిజనులను వెంటనే విడుదల  చేయాలి ఏపీజీఎస్  రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
 
పాడేరు : మన్యం మనుగడకు ముప్పు కలిగించే బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజనులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధాలను గిరిజన వర్గాలు సంఘటితంగా ఖండించాలని బుధవారం పాడేరులో ఏపీ గిరిజన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న గిరిజనులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.  ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం  

బాక్సైట్ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగా మన్యంలో గిరిజనులపై నిర్బంధాలను ప్రయోగిస్తోందని విమర్శించారు.  బాక్సైట్‌పై ప్రభుత్వ మొండి వైఖరివ ల్లే జర్రెల మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యారని, ఈ హత్యతో సంబంధం లేని అమాయక గిరిజనులను చింతపల్లి, జీకేవీధి పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి బలవంతంగా ఒప్పించారని ఆవేదన వ్యక్తంచేశారు.  జనవరి 8న అదుపులోకి తీసుకొని 15న అరెస్ట్ చేసినట్లు కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. 18 మందిని సెంట్రల్ జైలులో నిర్బంధించారని, పోలీసులు అరెస్ట్ చేసిన గిరిజన సంఘం నాయకుడు చిక్కుడు అశోక్, వైఎస్సార్ సీపీ నాయకుడు అడపా విష్ణుమూర్తిని నడవడానికి కూడా వీలులేని విధంగా కాళ్లపై తీవ్రంగా కొట్టారని, బాక్సైట్‌కు వ్యతిరేకపోరాటం చేస్తే ఇదే గతి పడుతుందని పోలీసు అధికారులు హెచ్చరించడం నిర్బంధాలకు పరాకాష్టని మండిపడ్డారు. బాక్సైట్ ఉద్యమాన్ని అణచివేసేందుకు జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో ప్రభుత్వం వంద పోలీసు ఔట్  పోస్టులను ఏర్పాటు చేసేందుకు చూస్తోందన్నారు.   జీవో 97 రద్దుకు, బాక్సైట్ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించేందుకు సిద్ధం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పీసా డివిజన్ అధ్యక్షుడు కోడా అజయ్‌కుమార్, సీఐటీయు డివిజన్ కార్యదర్శి ఆర్.శంకరరావు, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు నర్సయ్య, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.సూర్యనారాయణ, ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు రామారావుదొర, జీఎస్ యు జిల్లా అధ్యక్షుడు వి.రాంబాబుపాల్గొన్నారు.

గిరిజనులను హింసించడం దారుణం
కొయ్యూరు: బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గిరిజనులను చిత్రహింసలకు గురిచేయడం దారుణమని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.సూరిబాబు ఆందోళన వ్యక్తంచేశారు.   గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం అల్లూరి పార్క్ వద్ద నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వితే పర్యావరణం పూర్తిగా నాశనమవుతుందని మేధావులు   చెబుతున్నా ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి మన్యంలో గిరజనులపై నిర్బంధం పెరిగిందని చెప్పారు. బూదరాళ్ల  సర్పంచ్  సుమర్ల  సూరిబాబు, సీపీఎం  చింతపల్లి డివిజన్ కార్యదర్శి ఎం బూరుగలయ్య సీఐటీయూ నేత వై.అప్పలనాయుడు, వైఎస్సార్ సీసీ నాయకుడు నాని తదితరులు మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు