కవి స్వేచ్ఛాజీవి

25 Aug, 2014 02:20 IST|Sakshi
కవి స్వేచ్ఛాజీవి

 - సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ
 
ఆ కలానికి జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఆ సాహిత్యం.. ప్రజా సమస్యల ప్రతిబింబం. పదంపదంలో  ఉద్యమపథం.. మాటమాటలో పోరాట కెరటం. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. తెలుగు పద ప్రయోగంలో కొత్త ఒరవడిని సృష్టించి.. తెలుగు పాటకు జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన సినీకవి, సాహితీమూర్తి సుద్దాల అశోక్ తేజ. ఆయన రాసిన పాటల పూదోటలో ఎన్నో  కుసుమాలు.. మరెన్నో కాంతి శిఖరాలు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న అశోక్ తేజ  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ  సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు.     
 
- విజయవాడ కల్చరల్
 
 సాక్షి : కృష్ణవేణి క్రియేషన్స్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం అందుకున్నందుకు  అభినందనలు..
 అశోక్ తేజ : థ్యాంక్స్..
 
సాక్షి : మీది సుదీర్ఘ సినీ ప్రస్థానం కదా.. ఇందులో మీరు నేర్చుకున్నదేమిటీ?
అశోక్ తేజ : లౌక్యం నేర్చుకున్నా. లౌక్యం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
 
సాక్షి : ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. అవన్నీ స్వేచ్ఛగా రాసినవేనా..
అశోక్ తేజ : కవి ఎప్పుడూ స్వేఛ్చాజీవే. అతడిని శాసించేవారు ఏకాలంలోనూ ఉండరు.
 
సాక్షి : ప్రజాకవిగా జనంకోసం బతికిన సుద్దాల హనుమంతు కుమారుడు మీరు. మీపై మీ తండ్రి ప్రభావం ఏమైనా ఉందా..
అశోక్ తేజ : నా మాట.. పాట.. అంతా మా నాయనగారే. నేను ఈస్థానంలో ఉండటానికి ఆయనే కారణం. అందుకే ఆయన పేరుతో ప్రారంభించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా కవులను సత్కరిస్తున్నా.
 
సాక్షి : మీరు రాసిన ఏ పాటకైనా జాతీయ అవార్డు వస్తుందని ఆశపడ్డారా..
అశోక్ తేజ : నాకు బాగా ఇష్టమైన పాటల్లో ‘ఒకటే మరణం ఒకటే జననం..’ అనే పాటకు వస్తుందని ఆశపడ్డా..
 
సాక్షి : సినీ రంగంలో ప్రతిభకు స్థానం ఉందా..
అశోక్ తేజ : తప్పకుండా ఉంటుంది. సినీ రంగంలో నాకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. అరుునా నేను 20ఏళ్లు ఈ రంగంలోనే నిలబడ్డా. కాసింత అదృష్టం కూడా ఉండాలి.
 
సాక్షి : మీ పాటల వెనుక ప్రోత్సాహం ఎవరు?
అశోక్ తేజ : జనం ఉన్నారు. జనం కోసం బతికిన కవులున్నారు. నా పాట వెనున ఆవేదన ఉంది. అన్నింటికంటే నా తండ్రి ఉన్నారు.
 
సాక్షి : సినీకవికి కావాల్సిన అర్హతలేమిటీ?
అశోక్ తేజ : సాహిత్యం తెలిసి ఉండాలి. కాస్త సంగీత పరిజ్ఞానం కూడా అవసరం.
 
సాక్షి : తెలుగు సినిమా పాటల్లోని ఆంగ్ల పదాల వల్ల భాష చనిపోతోందని భాషావేత్తల ఆవేదన. దీనికి మీ సమాధానమేంటి?
అశోక్ తేజ : ఆంగ్ల పదాలు 20 శాతం ఉంటే ఫర్వాలేదు. అంతకుమించి ఉంటే ప్రమాదమే..
 
సాక్షి : ఒక పాట రాసిన తరువాత.. ఇది ఇంకా బాగా రాసుంటే బాగుండేదని అనిపించిన  సంఘటనలేమైనా ఉన్నాయూ..
అశోక్ తేజ : దాదాపు లేవు. ఒక పాట రాసిన తరువాత దాని గురించి నేను ఆలోచించను.
 
సాక్షి : తెలంగాణ రాష్ర్ట సాధనకు కవులంతా  ఏకమయ్యూరు. సీమాంధ్రలో ఆ స్ఫూర్తి లేకపోవ డానికి కారణం.
అశోక్ తేజ : అది వారివారి ఆలోచనా పరిధిని బట్టి ఉంటుంది.
 
సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు పాటలు రాశారు.
అశోక్ తేజ : 800 సినిమాల్లో 2వేలకు పైగా పాటలు రాశాను.
 
సాక్షి : జానపద కళలను కాపాడుకోవటమెలా..
అశోక్ తేజ : కేవలం వ్యక్తుల వల్లో.. కళాసంస్థల వల్లో అది సాధ్యం కాదు. ప్రభుత్వం కళా పీఠాలు స్థాపించాలి. వాటికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. దేశం మెత్తంమీద ఉన్న జానపద  సంపదల వివరాలు తెలుసుకోవాలి. వాటిని ప్రదర్శించే వారికి ఉపాధి సౌకర్యాలు కలిపించాలి.
 
సాక్షి : ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగును ఎలా కాపాడుకోవాలి?
అశోక్ తేజ : భాషను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. భాషను కాపాడుకోవాలన్న  ఆలోచన ప్రజలకు రావాలి.
 

మరిన్ని వార్తలు