‘కోట’ కమిషనర్ ఆకస్మిక మృతి

18 Oct, 2014 03:22 IST|Sakshi
‘కోట’ కమిషనర్ ఆకస్మిక మృతి

* గుండెపోటుతో శుక్రవారం ఉదయం కన్నుమూసిన నాగేంద్ర ప్రసాద్
* తనపై ఎస్సీ, ఎస్టీ కేసుతో కొన్నాళ్లుగా మనస్తాపం
* ఈ నేపథ్యమే విషాదానికి కారణమంటున్న సిబ్బంది

 సామర్లకోట : సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జ్యోతుల నాగేంద్రప్రసాద్ (48) శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. స్థానిక రత్నంరాజు ఆస్పత్రి సమీపంలోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్న ఆయనకు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మాధవపట్నంలోని గ్లోబ ల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లక్ష్మి, బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న యశ్వంత్, పదో తరగతి చదువుతున్న హేమంత్ అనే కుమారులు ఉన్నారు.

ఇటీవల ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదుపై కమిషనర్‌తో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ పైనా, ఆమె భర్త పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచీ మనస్తాపంతో ఉన్న ప్రసాద్ ఆ ఒత్తిడిని తట్టుకోలేక కన్నుమూశారని మున్సిపల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్‌గా పట్టణంలో ఉత్తమ సేవలు అందించడమే కాక మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అలాంటి అధికారి ఇలా అకాలంగా మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ కేసు నేపథ్యంతో మానసిక ఒత్తిడితోనే కమిషనర్ మృతి చెందారని మున్సిపల్ ఎంప్లాయీస్ ఎస్సీ సంఘ నాయకులు కె. రఘుప్రసాద్, అప్పారావు, దండోరా యూనియన్ నాయకులు తాతపూడి కృష్ణబాబు, వల్లూరి నాని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆర్డీ రవీంద్రబాబు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, తుని, మండపేట, ఏలేశ్వరం కమిషనర్‌లు గోవిందస్వామి, ఎ. వెంకట్రావు, రాము, వెంకటరమణ, శ్రీరామశర్మ, సుధాకర్, రాష్ట్ర మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి ఏసుబాబు, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, ఉప ముఖ్యమంత్రి సోదరుడు జగ్గయ్యనాయుడు తదితరులు ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప..ప్రసాద్ భార్య లక్ష్మితో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు.

కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు. సంతపసూచకంగా పట్టణ పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. స్టేషన్, బళ్ల సెంటర్లలోని మున్సిపల్ షాపులను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసి వేశారు.  ఆస్పత్రి నుంచి ప్రసాద్ భౌతికకాయాన్ని మున్సిపల్ కార్యాలయం ఆవరణకు తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం రెండు గంటలు ఉంచాక ఆయన నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌కు తీసుకువచ్చారు.

ఆ సమయంలో భార్యాబిడ్డల రోదన స్థానికుల హృదయాలను కలచివేసింది. తన భర్తను అన్యాయంగా పొట్టన  పెట్టుకున్నారని లక్ష్మి రోదించింది. ప్రసాద్ స్వగ్రామమైన అనకాపల్లి సమీపంలోని చోడవరంలో ప్రస్తుతం తుపాను కారణంగా విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో అంత్యక్రియలను సామర్లకోటలోనే జరపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం రాత్రికి సమీప బంధువులు వచ్చాక ఏ విషయం నిర్ణయమవుతుంది.

మరిన్ని వార్తలు