పదోన్నతి కల్పించాల్సి ఉన్నా..

24 Jun, 2019 08:33 IST|Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు (కడప) : ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు ప్రకటించిన జేఏఓల పదోన్నతుల్లో తనకు  అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు డివిజనల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న దివ్యాంగుడు బి. సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం సాక్షి తో మాట్లాడారు. 2006లో రిక్రూట్‌మెంట్‌ ద్వారా 88 మార్కులతో  తాను విద్యుత్‌ సంస్థలో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా ఓపెన్‌ కేటగిరీలో ఉద్యోగం పొందానని పేర్కొన్నారు.

ఈ నెల 21 తేదీన ఎస్పీడీసీఎల్‌ అధికారులు సర్కిల్‌ పరిధిలో పనిచేస్తున్న 12 మంది జేఏఓలకు అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లుగా (ఏఏఓ) పదోన్నతులు కల్పించారని తెలిపారు. జీఓఎంఎస్‌ నంబర్‌42, 2011 అక్టోబర్‌ 19 తో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ సివిల్‌ అప్పీల్‌ నంబర్‌.9096 ఆఫ్‌ 2013 ప్రకారం దివ్యాంగుల కోటాలో తనకు పదోన్నతి కల్పించాల్సి ఉందన్నారు. అయితే అధికారులు ఇందుకు  భిన్నంగా తనకంటే తక్కువ మార్కులు పొందిన మరో అధికారికి పదోన్నతి కల్పించారన్నారు. రిక్రూట్‌ మెంట్‌లో 75 మార్కులు పొందిన అతనికి ఎస్సీ రిజర్వేషన్‌ ద్వారా ఉద్యోగం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం అదే రోస్టరు ద్వారా పదోన్నతి కల్పించకుండా దివ్యాంగుల కోటాలో ఎలా పదోన్నతి కల్పిస్తారని ప్రశ్నించారు. పదోన్నతి గురించి దాదాపు రెండేళ్లుగా సీఎండీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు