కేఈ కుటుంబ కబంధహస్తాల్లో సుద్దవాగు

6 Mar, 2019 12:56 IST|Sakshi
ఆక్రమణకు గురైన వాగును పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

పరిరక్షణకు సీపీఎం నాయకుల డిమాండ్‌

కబ్జాకు గురైన వాగు పరిశీలన

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డిప్యూటీ సీఎం కేఈ కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కిన సుద్దవాగును పరిరక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి కోరారు.  కర్నూలు గణేష్‌ నగర్‌ వెంట పారుతున్న సుద్దవాగు కబ్జాకు గురైందన్న స్థానికుల సమాచారం మేరకు సీపీఎం నాయకులు    కె. ప్రభాకరరెడ్డి, పి.రాముడు, సీహెచ్‌సాయిబాబా, ఆర్‌ నరసింహులు, వీ.వెంకటేశ్వర్లు, వీరన్న, రామకృష్ణ తదితరులతో కూడిన బృందం మంగళవారం అక్కడకు వెళ్లి పరిశీలించింది.

ఏకంగా వాగునే ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నాలను చూసి వారు మండిపడ్డారు. వాగును పూడ్చేస్తే నీరు పారేదెలా అని ప్రశ్నించారు. ఇలా అయితే చిన్నపాటి వర్షానికే నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. సుద్దవాగుకు రక్షణ గోడ నిర్మాణం కోసం గఫూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేయించినా తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం వాగు ఆక్రమణదారుల చెరలో కనుమరుగైపోతోందన్నారు. వాగును ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నా అధికారులు మిన్నకుండి పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆక్రమణదారులపై చర్యలు తీçసుకుని వాగును పరిరక్షించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు