స్థానిక సంస్థలకు డబ్బే డబ్బు!

17 Mar, 2014 02:41 IST|Sakshi
స్థానిక సంస్థలకు డబ్బే డబ్బు!

 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత నిధుల పండుగ
 కేంద్రం నుంచి విడుదల కానున్న వందల కోట్ల నిధులు
 కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి
 
 సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు నిధుల పండుగ రాబోతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాక కాసులు గలగల్లాడనున్నాయి. పంచాయతీ సంస్థలకు ఎన్నికలు నిర్వహించనందున ఆగిపోయిన రూ.వందల కోట్ల నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కేంద్రం 13వ  ఆర్థిక సంఘం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో రూ.489 కోట్లు విడుదలవగా, ఈ వారంలో మరో రూ. 516 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులొచ్చే సమయానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అవి స్థానిక సంస్థలకు సర్దుబాటు కాకుండా ఆగిపోయాయి. స్థానిక సంస్థలకు మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించని కారణంగా రూ. 2,900 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉంటే.. ఇప్పటివరకు రూ. వెయ్యి కోట్లే విడుదలయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాక మిగిలిన నిధులనూ విడుదల చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి ఇంకా రూ. 1,900 కోట్ల నిధులు రావాల్సి ఉంది.
 
 అయితే ఇందుకు ప్రస్తుతం విడుదల చేసిన నిధులు వ్యయం చేసినట్లు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. 13వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో గ్రామపంచాయతీలకు 70 శాతం, జిల్లా పరిషత్‌లకు 20 శాతం, మండల పరిషత్‌లకు పది శాతం నిధులు పంపిణీ చేస్తారు. ఈ నిధులన్నీ.. ఆయా జిల్లాల్లోని జనాభా ప్రతిపాదిక లెక్కన విడుదల చేస్తారు. ఇవి కాక వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు ఫండ్  కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 462 కోట్లు రావాల్సి ఉండగా.. రూ.137 కోట్లే విడుదలవ గా.. ఇంకా రూ. 325 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈసారి ఆ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం లేదని పంచాయతీరాజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధులు కాక రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సంస్థలకు తలసరి గ్రాంటు కింద ఇచ్చే నిధుల్లో జిల్లా పరిషత్‌లకు ఒక్కరికి రూ. 4 లెక్కన జెడ్పీటీలకు రూ. 22.16 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 8 లెక్కన రూ. 44.32 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ. 4 లెక్కన రూ. 22.16 కోట్లు, సీనరేజి కింద జిల్లా పరిషత్ , పంచాయతీలకు చెరో రూ. 30 కోట్లు, మండల పరిషత్‌కు రూ. 50 కోట్ల నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ విడుదల చేసే రూ. 300 కోట్ల నిధులు అదనం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ నిధులు అందుబాటులోకి రానున్నాయి.
 
 జెడ్పీ చైర్‌పర్సన్ వేతనం రూ.7,500: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లకు రూ. 7,500, ఎంపీపీలకు రూ. 1,500, సర్పంచ్‌లకు రూ. 1,500 నెలసరి గౌరవ వేతనంగా ఇదివరకు నిర్ణయించినదే కొనసాగనుంది. జెడ్పీటీసీలకు రూ. 2,250 ఎంపీటీసీలకు రూ. 750 గౌరవ వేతనం ఇస్తారు. వీరికి సమావేశాలకు హాజరైనప్పుడు సిట్టింగ్ ఫీజు కింద రూ. 100 నుంచి రూ. 150 చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు