చెరకు రైతుల డబ్బు బకాయి కింద జమ

17 Jun, 2014 01:32 IST|Sakshi

* రూ. 218 కోట్లు బదలాయించుకున్న బ్యాంకులు
* కృష్ణాలో లబోదిబోమంటున్న రైతులు

 
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో చెరకు రైతులకు రుణమాఫీ హుళక్కైంది. బ్యాంకర్లు పంట రుణ బాకీలను వసూలు చేసేసుకున్నారు. జిల్లాలో హనుమాన్ షుగర్స్, ఉయ్యూరు కేసీపీ, లక్ష్మీపురం చక్కెర కర్మాగారాలు 2013-14 సీజన్‌కు సంబంధించిన పంట డబ్బును రైతులకు విడుదల చేశాయి. యాజమాన్యాల నుంచి మూడురోజుల క్రితం రైతుల ఖాతాల్లో పడిన పంట డబ్బును బ్యాంకు అధికారులు పంట రుణం కింద జమ చేసేసుకున్నారు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఈ పరిణామంతో నివ్వెరపోరుుంది. ప్రభుత్వం రుణమాఫీపై నాన్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 బ్యాంకు అధికారులు కూడా రుణమాఫీకి సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాకపోవటం వల్లే రైతుల రుణ ఖాతాలకు షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన డబ్బును తాము జమ చేసుకున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని 23,500 మంది చెరకు రైతుల రుణాలకు సంబంధించిన మొత్తం రూ.218 కోట్లను బ్యాంకు అధికారులు ఈ విధంగా జమ చేసేసుకున్నారు. బ్యాంకర్లు రైతులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిబంధనల మేరకే తమకు రావలసిన బకాయిలను జమ చేసుకోవడంతో.. రైతులు కూడా దీనిపై ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని రైతులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు