చక్కెర మిల్లుకు చేదు కాలం!

2 Aug, 2014 02:34 IST|Sakshi
చక్కెర మిల్లుకు చేదు కాలం!
  •      జిల్లాలో పెరుగుతున్న చెరకు విస్తీర్ణం
  •      చతికిలపడుతున్న సుగర్ ఫ్యాక్టరీలు
  •      ఆధునికీకరణకు సర్కారు చొరవ చూపేనా
  •      ఎపిట్‌కో కమిటీ నివేదికను పరిశీలించాలంటున్న యాజమాన్యాలు
  • చోడవరం : జిల్లాలో వరికి సమానంగా రైతులు చెరకు పంటను సాగుచేస్తున్నారు. చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారాలు  ఉండడంతో ఏటా లక్షన్నర ఎకరాలకు మించి చెరకు సాగు జరుగుతుంది. ఈ ఏడాది వరి సాగుకు వాతావరణం అనుకూలించకపోవడంతో చెరకు సాగు సుమారు 20 శాతం పెరిగింది. సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా 40వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది.

    అంటే సుమారు 2 లక్షల ఎకరాల వరకు ఈ ఏడాది చెరకు సాగు జరుగుతుంది. అయితే పంట విస్తీర్ణం పెరుగుతున్నా ఉన్న నాలుగు ఫ్యాక్టరీల్లో ఏటేటా మిషనరీ పాతబడి పోయి క్రషింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. సాగుకు అనుకూలంగా ఫ్యాక్టరీలు ఆధునికీకరణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల కిందట ఎపిట్‌కో కమిటీ రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార చక్కెర కర్మాగారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. తక్షణం ఆధునికీకరణ జరగకపోతే ఫ్యాక్టరీలన్నీ మూతపడే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

    సుమారు రూ.500 కోట్లు వెచ్చిస్తే అన్ని ఫ్యాక్టరీలు తిరిగి రైతులకు భరోసాగా నిలుస్తాయని సూచింది. అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయ్యే బెగాస్ ద్వారా విద్యుత్‌ను  ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నందున అన్ని ఫ్యాక్టరీల్లోనూ కో జనరేషన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని, తమిళనాడు మాదిరిగా ఇక్కడ కూడా ట్రాన్స్‌కోకు వీటి నిర్వహణ అప్పగిస్తే మంచిదని సూచింది. అయితే కిర ణ్‌కుమార్ సర్కార్ ఎపిట్‌కో కమిటీ నివేదికను పక్కన పెట్టింది.
     
    బకాయిలతో నెట్టుకొస్తున్నారు...
     
    ఈ ఏడాదైనా సుగర్ ఫ్యాక్టరీలను ఆధునికీకరించకపోతే చోడవరం, ఏటికొప్పాక లాంటి లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీలు కూడా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. పంచదార ధర రెండేళ్లుగా ఘోరంగా పడిపోవడంతో కనీస మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితిలో ఫ్యాక్టరీలు పడ్డాయి. చోడవరం ఫ్యాక్టరీకి ఉప ఉత్పత్తులైన మొలాసిస్, కో జనరేషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో గట్టెక్కినప్పటికీ మిగతా ఫ్యాక్టరీలు రైతులకు నేటికీ ఈ బకాయిలు చెల్లించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇటు రైతులను, అటు ఫ్యాక్టరీల మనుగడను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఏడాదైనా సుగర్ ఫ్యాక్టరీల ఆధునికీకరణకు చొరవ చూపాలని రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కోరుతున్నాయి.
     
    ఆధునికీకరణ చాలా అవసరం
     
    సహకార చక్కెర కర్మాగారాలు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆధునికీకరణ ప్రతి ఫ్యాక్టరీకి చాలా అవసరం. చెరకు పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఫ్యాక్టరీల క్రషింగ్ కెపాసిటీ లేక పంటను పూర్తిగా ఫ్యాక్టరీలు తీసుకోలేకపోతున్నాయి. గతంలో ప్రభుత్వాలు వేసిన కమిటీల ప్రతిపాదనలు కూడా ఇంకా ఆచరణలోకి రాలేదు. మొలాసిన్, ఇథనాయిల్‌కు ఇప్పుడు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఫ్యాక్టరీల్లో ఉప ఉత్పత్తుల యూనిట్లు లేకపోవడం వల్ల కూడా ఆర్థికంగా వెనుకబడిపోతున్నాయి. ఇప్పుడు పూర్తిగా పంచదారపైనే ఆధారపడాల్సి వస్తుంది. అది కూడా ధరలు హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రతి ఫ్యాక్టరీలో క్రషింగ్ సామర్ధ్యాన్ని పెంచే బాయిలర్ హౌస్‌లను నిర్మించుకోవాల్సి ఉంది.
     
    -వి.వి.రమణారావు, ఎండీ, గోవాడ సుగర్స్
     

మరిన్ని వార్తలు