‘తియ్యటి’ విపత్తు.!

4 Jun, 2018 13:02 IST|Sakshi

జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తున్న సుగర్‌ వ్యాధి

కేంద్ర ప్రభుత్వ పైలెట్‌ ప్రాజెక్టుగా కృష్ణా

జిల్లాలో 5 లక్షల పైగానే రోగులు

గ్రామాల్లో 11 శాతం, పట్టణాల్లో 18 శాతం నమోదు

అవగాహనతోనే నియంత్రణ సాధ్యమంటున్న నిపుణులు

ఒకవైపు పెరిగిన జీవన వేగం, అది పెంచిన ఒత్తిడి.. మరోవైపు మోడ్రనైజేషన్‌ ముసుగులో అభివృద్ధి చెందుతున్నామనుకుంటూ దీర్ఘకాలిక రోగులతో నిండిపోతోంది మన సమాజం. ఎప్పుడో అరవైల్లో కనపడాల్సిన వ్యాధులు కూడా ఇరవై, ముప్పైల్లోనే పలకరించేస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం.. ఇది అంటు వ్యాధి కాదు అయినా దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఇదొక సైలెంట్‌ కిల్లర్‌. ముందుగానే గుర్తించి నియంత్రణలో పెట్టుకుంటే సరే! లేకపోతే పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకుండానే.. చాప కింద నీరులా ఒళ్లంతా గుల్ల చేసేస్తుంది. ఇంతటి పెను ముప్పు మన ‘కృష్ణా’ ఒంట్లో పాగా వేసింది.

లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణాజిల్లాలో మధుమేహ వ్యాధి వ్యాప్తి వేగంగా ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలు నిర్థారించడంతో, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫైలట్‌ పథకానికి జిల్లాను ఎంపిక చేశారు. జిల్లా జనాభాలో 30 ఏళ్లు దాటిన గ్రామీణుల్లో 11 శాతం, పట్టణాల్లో 18 శాతం మంది మధుమేహ రోగులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తేల్చాయి. వ్యాధిగ్రస్తుల్లో 25 శాతం మందికి లక్షణాలు ఏమి కనిపించని కారణంగా మందులు వాడటం లేదని.. వ్యాధి ఉందని తెలిసిన వారిలో కూడా 50 శాతం మందే మందులు వాడుతున్నారని, వారిలో కూడా 25 శాతం మంది మాత్రమే వ్యాధిని అదుపులో (హెచ్‌బీఏ1సీ 6.5 శాతంలోపు) ఉంచుకోగలుగుతున్నట్లు నిర్ధారణయ్యింది.

చిన్న వయస్సులోనే..
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే వ్యాధి బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల యువకుల్లో సైతం మధుమేహం సోకుతున్నట్లు చెబుతున్నారు. రెండు జిల్లాలో 8 లక్షలకు పైగా మధుమేహ రోగులు వుండగా, వారిలో 10 శాతం మంది 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాధి సోకిన ఐదు నుంచి పదేళ్లలో అవయవాలపై దుష్ఫలితాలు చూపుతున్నందున 35 నుంచి 45 ఏళ్లలోనే దయనీయ స్థితికి చేరుకుంటున్నట్లు హెచ్చరిస్తున్నారు.

దుష్ఫలితాలు..
గుండె జబ్బులకు గురవుతున్న వారిలో 40 శా తం మందిలో మధుమేహం కారణం అవుతోంది.
ఏటా మధుమేహం కారణంగా ఐదు వేల మం దికి పైగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు.
సుగర్‌ కారణంగా జిల్లాలో ఏటా వెయ్యిమందిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
వ్యాధి ఉన్న వారిలో 5 శాతం మందిలో గాంగ్రీన్స్‌ వస్తున్నట్లు చెబుతున్నారు. దీనిని తొలిదశలో గుర్తించకుంటే అవయవాలు(కాలు, చేయి) తొలగించాల్సిన ప్రమాదం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రాజెక్టులో చేసేది ఇది..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య సిబ్బంది మధుమేహంపై ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నారు. గ్రామీణుల్లో మధుమేహం ఉన్నట్లు నిర్థారణ అయితే వారు రెగ్యూలర్‌గా మందులు వాడేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆహార నియమాలు, వ్యాయామం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. రెగ్యూలర్‌గా రక్తపరీక్షలు, వైద్య పరీక్షలు చేస్తూ మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించనున్నారు.

అదుపు ఇలా..
మన శరీరంలో చక్కెర స్థాయిలు పరగడుపున 126.. ఆహారం తీసుకున్న తర్వాత 160 మించకుండా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా మూడు నెలల చక్కెర స్థాయిలు(హెచ్‌బీ ఏ1సీ) 6.5 ఉండేలా చూడాలి. అందుకు మితాహారం తీసుకుంటూ.. కొవ్వు పదార్థాలకు, పామాయిల్, వనస్పతి, కొబ్బరి నూనెలకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువుగా తీసుకోవాలి. అంతేకాకుండా రోజూ 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

ముందు చూపే మందు
మధుమేహంపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి సోకిన వారిలో సగం మందికిపైగా సరైన నియమాలు పాటించకపోవడం వల్ల దాని ప్రభావం గుండె, కిడ్నీ, మెదడు, కళ్లపై పడుతోంది. దీంతో ప్రాణాపాయం ఏర్పడంతో పాటు, మరికొందరు పూర్తిగా చూపును కోల్పోతున్నారు. వ్యాధి సోకిన పదేళ్లలోపు దుష్ఫలితాలు కనిపించడం లేదని, నియమాలు పాటించకపోతే.. అనంతరం అవయవాలు దెబ్బతిన్న తర్వాత చేయగలిగిందేమి ఉండదు. మధుమేహ వ్యాధి ఉన్న వారు ఆరోగ్యకరమైన ఆహార, వ్యాయామ నియమాలు పాటించడం, ఇతర నిర్ధేశిత మందులను క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.– డాక్టర్‌ ఎం. శ్రీకాంత్,మధుమేహ నిపుణుడు, విజయవాడ

మరిన్ని వార్తలు