విద్యుత్ తీగ తెగిపడి చెరకు తోట దగ్ధం

18 Dec, 2013 05:19 IST|Sakshi

మురమండ (కడియం), న్యూస్‌లైన్ :  చెరకు తోటపై విద్యుత్ తీగ తెగిపడ్డ సంఘటనలో సుమారు రూ.మూడు లక్షల నష్టం వాటిల్లింది. స్థానిక కల్యాణ మండపం సమీపంలోని పుంత రోడ్డులో మంగళవారం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో గారపాటి సత్తిబాబుకు చెందిన సుమారు ఐదెకరాల చెరకు తోట పూర్తిగా కాలిపోయింది. తెగిపడిన తీగ మిగిలిన వాటిని తాకుతూ కిందపడింది. దీంతో రెండు స్తంభాల మధ్యనున్న తీగల వెంబడి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో తోటంతా మంటలు వ్యాపించాయి.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తీగలు తెగిపడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో సమీపంలోనే చెరకు తోటలు కొట్టే కూలీలు ఉన్నారు. వారు కొంతమేర చెరకును నరికివేయడంతో మంటలు  పక్కనున్న తోటలకు వ్యాపించలేదు.  చేతికొచ్చిన తోట ఇలా కాలిపోవడంతో రైతు సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని, ప్రమాదం కారణంగా కనీసం పెట్టుబడి కూడా రాదని చెప్పాడు. మండపేటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేశారు.

మరిన్ని వార్తలు