సీబీఐ విచారణకు సుజనా డుమ్మా

27 Apr, 2019 03:58 IST|Sakshi

బెంగళూరుకు చేరుకున్నప్పటికీ గైర్హాజరు

అరెస్టు భయంతో న్యాయవాదులతో సమాలోచనలు 

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హాజరు మినహాయింపునకు విజ్ఞప్తి

సమాధానమివ్వని సీబీఐ

మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం

అప్పటికీ స్పందించకపోతే అరెస్టు వారెంట్‌!  

సాక్షి, బెంగళూరు/అమరావతి: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో సీబీఐ విచారణకు కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి డుమ్మా కొట్టారు. బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా గురువారం సుజనాకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుజనా గ్రూపునకు చెందిన ఎలక్ట్రికల్‌ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టŠస్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌) ఉద్దేశపూర్వకంగా తమను రూ. 71 కోట్ల మేర మోసం చేసిందంటూ ఆంధ్రా బ్యాంకు 2017లో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నోటీసులు అందుకున్న సుజనా శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తన సన్నిహితులు, న్యాయవాదులతో చర్చిస్తూ అలాగే ఉండిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తనకు ఆరోగ్యం సరిగా లేదని, విచారణ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని తన న్యాయవాదుల ద్వారా సీబీఐతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. వారి విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం అందకపోవడంతో ఆయన హాజరు కాకుండా మిన్నకుండి పోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేస్తారనే భయంతోనే విచారణకు హాజరుకాలేదనే వార్తలు గుప్పుమన్నాయి. అరెస్టు అయితే ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు ఉన్నందువల్ల బెయిల్‌ కోసం సోమవారం వరకు వేచి ఉండాల్సి వస్తుందనే ఇలా చేశారని తెలుస్తోంది. ఇదే కేసులో బీసీఈపీఎల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావుతో సహా ఇతర ఎండీలకు సీబీఐ నోటీసులు జారీ చేయగా వారు కూడా గైర్హాజరయ్యారు. విచారణకు గైర్హాజరీ విషయంలో సుజనా చౌదరిగానీ, ఇతరత్రా సంబంధికులు కానీ తమతో సంప్రదింపులు జరపలేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ, ఈడీ
వివిధ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని సుజనా చౌదరి ఎగ్గొట్టినట్లు నిర్ధారించిన ఈడీ, సీబీఐలు అందుకు పక్కా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఒక్కో బ్యాంకు నుంచి తీసుకున్న రుణం డొల్ల కంపెనీల ద్వారా చివరకు ఎవరి వద్దకు చేరాయనే దానిపై విశ్లేషణ చేసే పనిలో సీబీఐ ఉంది. ఇటీవల బీసీఈపీఎల్‌ కేసుకు సంబంధించి వైస్రాయ్‌ హోటల్స్‌కు చెందిన రూ. 315 కోట్లు ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్‌లోని సుజనా ప్రధాన కార్యాలయంలో చేసిన సోదాల్లో వివిధ డొల్ల కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. లబ్ధి పొందిన బినామీ కంపెనీలు, వివిధ రుణదాతలు, వ్యాపార సంస్థలకు చెందిన వివరాలు లభించాయి. వీటి ఆధారంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సుజనా చౌదరి, అతని బినామీలకు ఎలా చేరిందన్న దానిపై దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయి. దీని తర్వాతనే చౌదరిని విచారణకు హాజరవ్వాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది. శుక్రవారం హాజరుకాకపోవడంతో మరోసారి సుజనానే స్వయంగా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని, దానికి కూడా స్పందించకపోతే అరెస్ట్‌ వారెంటు జారీ చేసే అవకాశముందని సీబీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

మరిన్ని వార్తలు