డొల్ల కంపెనీలపై సుజనాను ప్రశ్నించిన ఈడీ

4 Dec, 2018 18:22 IST|Sakshi

సాక్షి, చెన్నై : బ్యాంకులకు రూ 6000 కోట్ల మేర రుణాల ఎగవేత కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరిని ఈడీ అధికారులు మంగళవారం రెండో రోజూ సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా నిన్న సుజనాను లంచ్‌కు అనుమతించిన అధికారులు మంగళవారం మాత్రం మధ్యాహ్న భోజన విరామానికి బయటకు అనుమతించలేదు. సీబీఐ నమోదు చేసిన మూడు కేసుల్లో బ్యాంకులకు రుణాల ఎగవేతపైనే ఈడీ అధికారులు సుజనాను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.


నిధుల మళ్లింపుపై ఆరా..
విదేశాలకు నిదుల తరలింపుపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. 120 డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా నిధుల తరలింపుపైనా ఈడీ అధికారులు సుజనాను పలు కోణాల్లో ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కాగా, బ్యాంకుల నుంచి అడ్డగోలుగా రుణాలు పొందేందుకు సుజనా ఏకంగా 126 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని వాటిని షెల్‌ కంపెనీల ద్వారా బినామీ సంస్ధలకు బదలాయించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై పగడ్బందీగా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు మరింత లోతుగా విచారించేందుకు చెన్నైలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సుజనా చౌదరిని ఆదేశించారు. ఈడీ విచారణను తప్పించుకునేందుకు సుజనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో తాజాగా చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సుజనా హాజరయ్యారు. ఇక ఈడీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల కంటపడకుండా ఉండేందుకు సుజనా చౌదరి ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు