సెస్ చెల్లించకుంటే చర్యలు

5 Aug, 2014 00:13 IST|Sakshi
సెస్ చెల్లించకుంటే చర్యలు

సాక్షి, కాకినాడ : వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కార్మిక శాఖకు చెల్లించాల్సిన ఒక శాతం సెస్‌కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించకపోతే చర్యలు తప్పవని ఆ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు హెచ్చరించారు. వందల కోట్లలో పేరుకుపోయిన బకాయిల వసూళ్లలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. సెస్ వసూలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అసంఘటిత కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
 
జిల్లాలో బకాయిలు రూ.5 కోట్లకు పైగా పేరుకుపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిలో ఎక్కువ మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల నుంచి రావాల్సి ఉందని గుర్తించి సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ సీ పోర్ట్స్ వంటి ప్రైవేటు సంస్థలు సెస్ చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వపరంగా రూ.50 వేలకు పైబడి ఎలాంటి పనులు జరిగినా ఆ మొత్తంలో ఒక శాతం లేబర్‌సెస్ కింద చెల్లించాల్సిందేనన్నారు. రూ.10 లక్షల లోపు అంచనా వ్యయంతో నిర్మించుకునే వ్యక్తిగత గృహాలు, బహుళ అంతస్తుల సముదాయాలకు మాత్రమే  మినహాయింపు ఉంటుందన్నారు.
 
గత నెల రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌తో జిల్లాలో 1100 సంస్థల నుంచి రూ.1.11 కోట్లు వసూలైందన్నారు. 2007 నుంచి శాఖల వారీగా వసూలైన సెస్, బకాయిలు, చెల్లించిన సంస్థలు, చెల్లించనివి వంటి వివరాలతో 15 రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. బకాయిలను నెల రోజుల్లోగా వసూలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పరిశ్రమల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో  ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థలు పెరిగాయని,  వాటి నుంచి సెస్ వసూలు చేయాలన్నారు.
 
5 లక్షల మంది కొబ్బరి కార్మికుల కోసం పైలట్ ప్రాజెక్టు

అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కమిషనర్ చెప్పారు. ప్రతి జిల్లాలో కార్మికభవన్‌లు నిర్మించడంతో పాటు వర్కర్స్ ఫెసిలిటేషన్ సెంటర్లు, అడ్డా డెవలప్‌మెంట్ సెంటర్లు, సబ్సిడైజ్డ్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్మికుల పిల్లలకు వివాహ సమయంలో ఇచ్చే రూ.5 వేల బహుమతి సొమ్మును రూ.15 వేలకు పెంచామని, కార్మికుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచామని చెప్పారు.
 
కార్మికుల పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అసంఘటిత కార్మిక చట్టం కింద కోనసీమలో 5 లక్షలమంది కొబ్బరి కార్మికులకు లబ్ధి చేకూరే పైల ట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు తె లిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పైల ట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఐదు మండలాలను ఎంపిక చేసుకొని 2015 కల్లా బాలకార్మికులు లేనివిగా ప్రకటించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్మికశాఖ జాయింట్ కమిషనర్  వరహాలరెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ప్రకాశరావు, జెడ్పీ సీఈఓ సూర్యభగవాన్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ శ్రీనివాసులురెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు