దేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి వైఎస్సార్‌: సుమన్‌

8 Dec, 2019 11:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆయుధాన్ని నమ్ముకోవడం కంటే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం ద్వారా శరీరాన్నే ఆయుధంగా మలుచుకోవాలని మార్షల్‌ ఆర్ట్స్‌కు స్ఫూర్తి, ప్రముఖ సినీనటుడు సుమన్‌ అన్నారు. ఒక్కోసారి ఆయుధం మొరాయిస్తుందని, అదే ఆయుధం ప్రత్యర్థి చేతికి చిక్కే సమస్య ఉంటుందన్నారు. ఇందుకే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం ద్వారా స్వీయరక్షణకు ఎటువంటి ఢోకా ఉండదన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చన్నారు. స్థానిక దండమూడి రాజగోపాలరావు ఇండోర్‌ స్టేడియంలో సుమన్‌ షోటోకాన్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో  శనివారం నిర్వహించిన డాక్టర్‌ వైఎస్సార్‌ స్మారక 10 జాతీయ స్థాయి ఓపెన్‌ కరాటే పోటీల్లో ప్రారంభోత్సవంలో సుమన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి స్మారక కరాటే పోటీల్లో పాల్గొన డం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి అని కొనియాడారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, డ్వాక్రా అక్కా చెల్లిమ్మలకు రుణాలు  ఇలా ఎన్నో ఎవరూ ఊహించని సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప మహానేత తనకు చాలా ఇష్టమన్నారు. ఆ మహానేత  బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. దిశలాంటి సంఘటనలను ఎదుర్కొవడానికి మార్షల్‌ ఆర్ట్స్‌ చాలా అవసరమని, ఇందుకు ప్రతి పాఠశాలలో కరాటే విద్యను నేర్పించాలని తాను సీఎం జగన్‌ను కోరతానని అన్నారు.  తొలుత ఈ పోటీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు చేసిన మార్చ్‌ఫాస్ట్‌ వందన స్వీకారాన్ని ఉప ముఖ్యమంత్రి అందుకున్నారు.

 రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ కరాటే అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రతాప్, అకాడమీ వ్యవస్థాపకుడు సైదులు, పోటీల నిర్వాహకులు చిన్నపురెడ్డి, కాత్యాయని, సత్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేతలు  వేమారెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, జార్జి వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కలర్‌ బెల్ట్‌ కేటగిరీలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ కైవసం చేసుకుంది. బ్లూబెల్ట్‌ కేటగిరీలో తమిళనాడు, గ్రీన్‌ బెల్ట్‌ కేటగిరీలో కర్ణాటక, పర్‌పుల్‌ బెల్ట్‌ కేటగిరీలో ఏపీ క్రీడాకారులు తమ సత్తాను చాటారు. దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చిన్నారులు కరాటే విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.   

మరిన్ని వార్తలు