చిన్నారులకు వేసవి సెగ!

20 Apr, 2019 12:19 IST|Sakshi
కోవెలకుంట్లలోని వసతులు లేని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు

24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

అంగన్‌వాడీ చిన్నారులకు వర్తించని వైనం  

ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు   

కర్నూలు, కోవెలకుంట్ల: అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ఈ ఏడాది వేసవి సెగ తప్పడం లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏటా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు 50 రోజులపాటు సెలవులను ప్రకటిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్‌ 23తో ముగియనుండటంతో 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ ఏడాది వేసవి సెలవులు వర్తింపచేయకుండా వారి జీవితాలతో సర్కార్‌ చెలగాటమాడుతోంది. మండుటెండల్లో సైతం కేంద్రాలను నిర్వహిస్తుండటంతో చిన్నారులకు వేసవి సెగ తప్పేలా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 3,548 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు వయస్సున్న 3.35 లక్షల మంది చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు.

వర్తించని వేసవి సెలవులు
ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతో పోలిస్తే అంగన్‌వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఆరేళ్లలోపు వయస్సు ఉన్న వారే. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడంతో చిన్నారులకు వేసవికాలం అగ్ని పరీక్షగా మారింది. వసతుల లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అరకొరగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో వసతులు లేవు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబర్‌ నుంచే ఎండలు అధికమయ్యాయి. ఫ్యాన్లు కూడా లేని అంగన్‌వాడీ కేంద్రాలు జిల్లాలో కోకొల్లలు. ప్రభుత్వం అద్దె భవనాలకు తగినంత బాడుగ ఇవ్వకపోవడంతో గ్రామాల్లో వసతులు లేని ఇరుకైన ఇళ్లలో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఫ్యాన్లు అటుంచితే గాలి, వెలుతురు లేక చిన్నారుల బాధలు వర్ణణాతీతం. ఎండలు అధికం కావడంతో ప్రభుత్వ భవనాలతోపాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 10 గంటల నుంచే భానుడి విశ్వరూపానికి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు.  

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవి కాలాన్ని దృíష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. గత నెల 18వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కేంద్రాలు నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలతోపాటు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఇతర కూలీ పనులకు వెళ్లే చిన్నారులు ఉంటే వారి తల్లిదండ్రులు ఇళ్లకు వచ్చే వరకు కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు 50 రోజులు వేసవి సెలవులు ఉండగా ఆరేళ్లలోపు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తిపంచేయాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు