మండుటెండలో మాడిపోతున్నారు!

27 Mar, 2018 12:18 IST|Sakshi
చెట్టు నీడలో సేదతీరుతున్న వేతనదారులు

‘ఉపాధి’ పనుల వద్ద కానరాని సౌకర్యాలు

అందుబాటులో లేని మెడికల్‌ కిట్లు

ఎండలోనే పనులు చేస్తూ అవస్థలు పడుతున్న వేతనదారులు

సీతంపేట:ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నచోట మౌలిక సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసేచోట నిలువ నీడ కూడా లేకుండా పోయిందని, దీంతో ఒక్కోసారి అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలుమండిపోతున్నారు. రోజురోజుకు  ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. ఇలాంటి సమయంలో కూలీలకు వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.  జిల్లాలో 5,65,650 వేల కుటుంబాలున్నాయి. వీటిలో 11,76,647 మంది కుటుంబసభ్యులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 58,860, ఎస్టీలు 46,762, ఇతరులు 4,64,028 మంది వేతనదారులకు జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో ఈ ఏడాది 5,57,923 మంది వేతనదారులకు ఉపాధి పనులు కల్పించాలని అధికారులు చర్యలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్టీ జనాభాకు43,318 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇవ్వగా  టీపీఎంయూ (ట్రైబుల్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌) పరిధిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లోని గిరిజన వేతనదారులు లక్ష మందికి పైగా ఉపాధి పనులకు వెళ్తున్నారు.

పేరుకుపోయిన వేతన బకాయిలు
ఉపాధి వేతనదారులకు గతేడాది జిల్లా వ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.మూడు, నాలుగేసి నెలలు బకాయిలుంటే ఎలా బతుకుతామని వేతనదారులు ప్రశ్నిస్తున్నారు. చేసిన కష్టానికి సకాలంలో ప్రతిఫలం రాకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. వేసవి కాలంలో అయితే రోజువారీ వేతనంతో పాటు అదనంగా 25 నుంచి 30 శాతం కలిపి వేతనం ఇవ్వాలి.
ఇదికాకుండా పనులుచేసే చోట తాగునీటి సౌకర్యం లేని పక్షంలో కూలీలు తాగునీరు తెచ్చుకుంటే రోజుకు రూ.5 ఇస్తారు. పనులు చేసేందుకు అవసరమైన గునపం పదును చేసుకునేందుకు రూ.10 ఇవ్వాలి. ఒక్కో వేతనదారుకి రూ.194 వరకు కూలి గిట్టుబాటు కావాలి. కాని ఎండ కారణంగా పని ముందుకు సాగకపోవడంతో తక్కువ వేతనమే గిట్టుబాటు అవుతోందని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవంటున్నారు.

టెంట్లు రాలేదు
ఈ ఏడాది ఇంకా టెంట్లు రాలేదు. గత ఏడాది పంపిణీ చేశాం. మందుల కిట్లు కూడా రాలేదు. ప్రస్తుతానికి వేతనదారులకు గునపాలు పంపిణీ చేశాం.–శంకరరావు, ఏపీవో, ఉపాధి హామీ పథకం

మరిన్ని వార్తలు