నిప్పుల కొలిమి

29 Apr, 2019 12:21 IST|Sakshi
డోన్‌ మండలం రేకులకుంట గ్రామంలో ఎండ తీవ్రతకు మృతిచెందిన నెమలి

మండుతున్న ఎండలు 44 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రత

జనం విలవిల పశుపక్ష్యాదులకు ప్రాణసంకటం

కర్నూలు(అగ్రికల్చర్‌): సూరీడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ‘సెగ’ పెంచుతున్నాడు. వాతావరణాన్ని నిప్పుల కొలిమిలా మార్చేస్తున్నాడు. దీంతో జనం బయట అడుగు పెట్టలేని పరిస్థితి. ఇంట్లో ఉన్నా ఉక్కపోతతోఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కష్టజీవుల పరిస్థితి దయనీయంగా మారింది. వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. పశుపక్ష్యాదుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఎండల తీవ్రతకు తోడు ఎక్కడా నీళ్లు దొరక్క, ఆహారం సైతంభారమై నేలరాలుతున్నాయి. నెమళ్లు వంటి పెద్ద పక్షులు సైతం మృత్యువాత పడుతుండడం ఆందోళన కల్గించే విషయం. వేసవి తీవ్రత పెరుగుతున్నా కనీస ఉపశమన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. చలివేంద్రాలు భారీగా ఏర్పాటు చేసినట్లు కాగితాల్లో చూపుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం కన్పించడం లేదు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
గత ఏడాది ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు  41 నుంచి 42 డిగ్రీల వరకు ఉండేవి. కానీ ఈ సారి 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీన్నిబట్టే వేసవి తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఆదివారం ఉయ్యాలవాడ, సంజామల మండలాల్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కర్నూలు, దొర్నిపాడు, రుద్రవరం, మంత్రాలయం, బనగానపల్లె, నంద్యాల, కొలిమిగుండ్లలో 43 డిగ్రీలు, దేవనకొండ, తుగ్గలిలో 42 డిగ్రీలు, మహానందిలో 40 డిగ్రీల ప్రకారం నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 29 డిగ్రీలు ఉంటున్నాయి.  

వడదెబ్బ మరణాలు కావట!
బతుకు దెరువు కోసం పనులకు వెళుతున్న కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా  జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 మంది మరణించారు. ఈ ఒక్క నెలలోనే ఐదుగురు ‘ఉపాధి’ కూలీలు చనిపోయారు. అయితే వీటిని వడదెబ్బ మరణాలుగా గుర్తించడం లేదు. వివిధ కారణాల వల్ల మరణించారంటూ కలెక్టరేట్‌కు తప్పుడు రిపోర్టులు వస్తున్నాయి. అధికారికంగా ఇంతవరకు ఒక్క వడదెబ్బ మరణాన్ని కూడా ప్రకటించలేదు.

ఉపశమన చర్యలేవీ?
వేసవి ఉష్ణోగ్రతల నుంచి  ప్రజలకు తక్షణం ఉపశమనంకల్పించే చర్యలు ఈ సారి నామమాత్రమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 5,500 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చూపుతున్నారు. ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లోనూ అత్యధికం స్వచ్ఛంద సంస్థలకు చెందినవే. ఉపాధి పనులు జరిగే ప్రదేశాల్లో నీడ కల్పించడంతో పాటు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు.

ఎండ తీవ్రతకు నెమలి మృతి
డోన్‌ : మండల పరిధిలోని రేకులకుంట గ్రామ శివారులో శనివారం ఎండవేడిమి కారణంగా అస్వస్థతకు గురైన నెమలి మృత్యువాత పడింది. వేసవి నేపథ్యంలో ఎండలు అధికంగా ఉండడం, పరిసరాల్లో నీరు లేకపోవడంతో దాహార్తి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వచ్చిన నెమలి అస్వస్థతకు గురైంది. స్థానికులు సపర్యలు చేసి అటవీ అధికారులకు అప్పగించారు. కొద్దిసేపటి తర్వాత అది మృతి చెందింది. ఫారెస్టు రేంజర్‌ నాసిర్‌జా ఆధ్వర్యంలో నెమలికి స్థానిక పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు.     

వైద్యం కోసం వచ్చి...
ఆళ్లగడ్డ టౌన్‌: మండలంలోని బాచేపల్లికి చెందిన నరసింహుడు (33) వడదెబ్బకు గురై చనిపోయాడు. ఇతను ఆదివారం వైద్యం కోసం ఆళ్లగడ్డ వైద్యశాలకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురై ఆర్టీసీ బస్టాండు ఆవరణలో మృతి చెందాడు. పట్టణ పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు