వట్టిపోతున్న పాడి

25 Feb, 2017 19:09 IST|Sakshi
► ఫిబ్రవరిలోనే మొదలైన ఎండలు 
► రోజుకు పది నుంచి 15 లక్షల లీటర్ల తగ్గుదల 
► వేసవిలో దాదాపు రూ.వెయ్యి కోట్ల నష్టం అంచనా 
► పశుగ్రాసం కొరత, అనారోగ్యాలు, డీహైడ్రేషన్‌ ప్రభావం 
► ఆందోళనలో పోషకులు 
 
వేసవి వస్తుందంటే చాలు పాడి రైతులు భయపడుతుంటారు. మండే ఎండలు, పచ్చిమేత కొరత, తాగునీరు లేక పోవడం తదితర కారణాలు పాడిగేదెలపై ప్రభావం చూపుతాయి. దీంతో రైతులు మార్చి నుంచి జూలై వరకూ పాలదిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతుంటారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది ఎండలు ఒక నెల ముందుగానే ఫిబ్రవరిలో మొదలవడంతో అప్పుడే పాలు తగ్గుతున్నాయని పోషకులు చెప్తున్నారు. దీంతో ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర రైతులు నష్టపోయే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. 
 
చీమకుర్తి రూరల్‌:
ఎండాకాలం ప్రభావం పాల దిగుబడిపై స్పష్టంగా కనిపిస్తుందని పశువైద్యులు, పశుపోషకులు చెప్తున్నారు. జిల్లాలోని 22 లక్షల పశువులపై వేసవి ప్రభావం కనిపిస్తోంది. సాధారణ కాలంలో జిల్లాలో రోజుకు 45 లక్షల లీటర్ల పాలదిగుబడి వస్తుంటే వేసవిలో 30–35 లక్షలకు పడిపోతుంది. పది శాతం వెన్న ఉన్న పాలకు రూ.53లు చెల్లిస్తున్నారు. దాని ప్రకారం వేసవికాలంలో తగ్గుతున్న 15 లక్షల లీటర్లకు దాదాపు రోజుకు రూ.7 కోట్లు తగ్గుదల పశుపోషకులపై పడుతుంది. ఆ లెక్కన నెల రోజులకు కలిపి రూ. 210 కోట్లు నష్టం వస్తునట్లు అంచనా. వేసవి ప్రభావం మార్చి నెల నుంచి జూలై నెల వరకు ఉంటుంది. ఆ లెక్కన 5 నెలల కాలానికి దాదాపు వెయ్యి కోట్లు వరకు పాలదిగుబడిలో ఆదాయం తగ్గిపోతుందని పాలకేంద్రం నిర్వాహకుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  
 
పశుగ్రాసం కొరత, అనారోగ్యాల ప్రభావం 
పాడి పశువులపై వేసవి ఎండలతో పాటు పశుగ్రాసం కొరత, తాగునీటి ఇబ్బంది కారణంగా మురుగు నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు కూడా పాలదిగుబడిపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా గేదె పాలలో వచ్చే వెన్నశాతం 10 ఉంటే లీటరుకు రూ.53, ఆవుపాలలో 3.5 శాతం వెన్న ఉంటే రూ. లీటర్‌కు రూ. 26 వంతున చెల్లిస్తారు. శీతాకాలంలో పాలలో వెన్నశాతం 7–12 శాతం వరకు వస్తోంది. వేసవికాలంలో అది కాస్త 5–8 శాతానికి పడిపోతుంది. వెన్నశాతంతో పాటు ఎస్‌ఎన్‌ఎఫ్‌ (సాలిడ్‌ నాట్‌ ఫ్యాట్‌) శాతం ఆధారంగా కూడా వెన్నశాతాన్ని నిర్ణయిస్తారు. పాలలో ఎక్కువగా నీళ్లు కలిపితే ఎస్‌ఎన్‌ఎఫ్‌ 9 శాతం కంటే తగ్గిపోతుంది. అలాంటి పాలను పాలకేంద్రం వారు స్వీకరించరు.  
 
పశుపోషకులు తీసుకోవాలసిన జాగ్రత్తలు 
వేసవికాలంలో పాలదిగుబడి తగ్గకుండా ఉండాలంటే పశువులను ఎండలో తిప్పకుండా నీడపట్టున మేపుకోవాలి. దాంతో పాటు కాయజాతికి చెందిన ప్రోటీ¯ŒSలు ఉండేటువంటి పిల్లిపెసర, జనుము, అలసంద వంటి పచ్చిమేతను ఆహారంగా ఇవ్వాలి. అంతేగాని గింజ జాతికి చెందిన సజ్జ, జొన్న రకాలకు చెందిన చొప్పను ఆహారంగా తగ్గించాలి. దాంతో పాటు పశువులను మేపుకోవడానికి తీసుకుపోయినప్పుడు పొలాల్లో అడుగంటిన మురుగు నీరు తాగుకుండా జాగ్రత్తలు వహించాలి. దాని వల్ల లేనిపోని రోగాలు రావడంతో పాలదిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేయటం వల్ల కూడా డీహైడ్రేషన్‌ ప్రభావం పడుతుంది. పాలు పిండే వేళలు కూడా నిర్ధిష్టవైన షెడ్యూల్‌ను అమలు చేయాలి. ఇలా చేయటం వలన వేసవి పాలదిగుబడి నష్టాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయినా కొంతమేరకు నివారించవచ్చని అధికారులు చెప్తున్నారు.  
 
అనారోగ్యం దరిచేరకుండా చూడాలి 
వేసవికాలంలో సహజంగా పాల దిగుబడిపై ఎండల ప్రభావం ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే దానిని కొంతలో కొంత నివారించవచ్చు. అందులో భాగంగా కాయజాతి దాణా అయిన పిల్లిపెసర, అలసంద, జనుము వంటి ఆహారాన్ని అందించాలి. మురుగు నీరు తాగకుండా క్రమపద్ధతిలో పాలు తీసేందుకు షెడ్యూల్‌ను పాటించాలి. – పారా శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్‌ 
మరిన్ని వార్తలు